
ఆత్మకూరు, ఆగస్టు 17 : జూరాల జలవిద్యుత్ కేం ద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. వరద తగ్గుము ఖం పట్టడంతో నిలిచిపోయిన ఉత్పత్తి సోమవారం నుం చి పునర్ ప్రారంభమైంది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ ఫ్లో కొనసాగుతున్న పరిస్థితుల్లో మంగళవారం విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ జూరాలలో ఒక యూ నిట్, దిగువ జూరాలలోనూ ఒక యూనిట్‌ను రన్ చేస్తున్నారు. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం 100 మిలియన్ యూనిట్ల మార్కును దాటింది. ఎగువ జూరాల లో 93.926 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. వ రద స్థిరంగా కొనసాగితే మరో రెండ్రోజుల్లో ఎగువ జూ రాల సహితం సెంచరీ దాటేస్తుందని అధికారులు వెల్లడించారు. మంగళవారం ఎగువ జూరాలలో 1.337 ఎంయూ, దిగువ జూరాలలో 1.419 ఎంయూ ఉత్పత్తి జరిగింది.
టీబీ డ్యాంకు నిలకడగా ఇన్‌ఫ్లో
అయిజ, ఆగస్టు 17 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. మంగళవారం టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 14,204 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 14,383 క్యూసెక్కులుగా నమోదు అయింది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికిగానూను, 1633 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 9,280 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 8,860 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 420 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
నిండుకుండలా కోయిల్‌సాగర్
దేవరకద్ర రూరల్, ఆగస్టు 17 : కోయిల్‌సాగర్ 31.6 అడుగులకు(2.14 టీఎంసీలు) నీటి నిల్వ చేరుకున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 32.6 అడుగులు(2.27 టీఎంసీలు)గానూ, ప్రస్తుతం 31.6 అడుగుల వద్ద ఉందన్నారు. కేవలం ఒక్క అడుగు నీరు చేరితే పూర్తిస్థాయి నిండుతుందన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. వాగు పరిసర రైతులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను వాగుకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటి విడుదల కొనసాగుతున్నది. తాగునీటి అవసరాలకు నారాయణపేట, మద్దూర్, కొడంగల్ మండలాలకు 10క్యూసెక్కుల నీటి తరలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.