పండుగలా మహిళా బంధు సంబురాలు
కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు
టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
రైతుబీమా చెక్కు పంపిణీ
జడ్చర్లటౌన్, మార్చి 7 : ఆడబిడ్డల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల లక్ష్మీనగర్ కాలనీలో రూ.12 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళా సంఘం సభ్యులు, ఏఎన్ఎంలను సన్మానించి, వారితో సెల్ఫీ దిగారు. అనంతరం జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్హాల్లో సోమవారం కేసీఆర్ మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళలకు గౌరవాన్ని ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమ ఉనికి కోసం మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం చేతకాక.. ఇక్కడొచ్చి మోసపూరిత మాటలతో పబ్బం గడుపుతున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధరలను అందనంత ఎత్తుకు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మహిళలను సన్మానించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పలువురు మహిళలు రాఖీలు కట్టారు. అలాగే కుర్వగడ్డపల్లి గ్రామానికి చెందిన మణెమ్మ మృతిచెందగా.. రైతుబీమా పథకం కింద మంజూరైన రూ. 5 లక్షలు చెక్కును మృతురాలి కుమారులు శ్రీను, మహేశ్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, సింగిల్ విండో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ సారిక, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.