జిల్లాలో మరో మూడు పాఠశాలలు ఎంపిక
పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు
విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యత పెంచేలా..
గద్వాలటౌన్, మార్చి 6: ప్రభుత్వ బడుల్లో నూతన విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత పాఠశాలల్లో ఇందుకు సంబంధించిన కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచే వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా ఈ కోర్సులు ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో ఎంపిక చేసుకుని రాణించడంతో స్వయం ఉపాధికి ఎంతో ఉపయోగకరమంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆరు పాఠశాలల్లో వృత్తివిద్యా కోర్సు కొనసాగుతున్నది. తాజాగా మరోమూడు పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. మున్ముందు మొత్తం పాఠశాలల్లో కోర్సును అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నచ్చిన కోర్సు ఎంపిక..
600కు పైగా ఉన్న పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సును ప్రవేశపెట్టనున్నారు. మొత్తం మూడు కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. జిల్లాలో మూడు పాఠశాలలను ఎంపిక చేశారు. హోం ఫర్నీషింగ్, టైలరింగ్, అగ్రకల్చర్, ఎంబ్రాయిడరీ, లైన్మెన్, ప్లంబర్, బ్యూటీ వెల్నెస్ వంటి పలురకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకుని ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు.
జిల్లాలో మూడు పాఠశాలలు ఎంపిక
కోర్సులు ప్రవేశపెట్టేందుకుగానూ జిల్లాలో మూడు పాఠశాలలను విద్యాశాఖ ఎంపిక చేసింది. విద్యార్థుల సంఖ్యతోపాటు అన్ని ఉపకరణాలు భద్రపరిచేందుకు వీలుగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ఒకటి జిల్లా కేంద్రంలోని బాలిక ఉన్నత పాఠశాల, రెండోది నందిన్నె జెడ్పీహెచ్ఎస్, మూడోది ఉండవల్లి జెడ్పీహెచ్ఎస్లు ఉన్నాయి. వీటినే హబ్ పాఠశాలలుగా పరిగణిస్తారు. ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులను ప్రారంభిస్తారు.
గతంలో ఎంపికైనవి
గతంలో జిల్లాలో మొత్తం ఆరు పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, రాజోళి, మల్దకల్, ఉప్పేరు, బిజ్జారం, మాచర్ల జెడ్పీహెచ్ఎస్లు ఉన్నాయి.