
ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన హరితనిధిని అన్ని వర్గాలూ స్వాగతిస్తున్నాయి. హరితహారం కార్యక్రమం తో ఇప్పటికే రాష్ట్రమంతా పచ్చదనం పెంపొందింది. ఈ క్రమంలో హరితనిధి ద్వారా కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, విద్యార్థులు, సామాన్య ప్రజలంతా హరితనిధికి జై కొడుతున్నారు. మేము సైతం బాసటగా నిలుస్తామని ప్రజ లు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉందని స్వాగతిస్తూ.. తమ వంతు సహకారం అందిస్తామని చెబుతున్నారు.
మహబూబ్‌నగర్ అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ చిత్రం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం అనంతపురం గ్రామానికి చెందినది. గ్రామ పంచాయతీ పరిసరాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం నడుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అనుకుంటున్నారా.. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే ఎండలో నిలబడి ప్రజలు పాల్గొనాల్సి వచ్చేది. కానీ సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన పచ్చదనం వెల్లివిరుస్తున్నది. అందుకు ఈ గ్రామమే ఉదాహారణ. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు పెద్దవై అందరికీ నీడనిస్తున్నాయి. వృద్ధులు లైన్లో నిలబడి బతుకమ్మ చీరెలు తీసుకుని సంతోషంగా ఇంటి బాట పట్టారు. ఎండ మీద పడకుండా తమను ఈ పచ్చని చెట్లు కాపాడుతున్నాయని వారంతా సంతోషంగా చెప్పారు. ఒకప్పుడు ఎండలోనే నిలబడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. హరితహారం వల్ల వచ్చిన మార్పునకు ఈ ఒక్క ఉదాహరణే చాలు. ఇది ఒక్క అనంతపురంలోనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్లినా రోడ్లకు ఇరువైపులా పచ్చదనమే స్వాగతం పలుకుతున్నది. పల్లెల్లో పరుచుకున్న పచ్చదనమే హరితహారానికి ఉదాహారణగా నిలుస్తున్నది. భవిష్యత్‌లో హరితనిధితో హరితహారం కొంతపుంతలు తొక్కుతున్నదని గ్రామీణులు అభిప్రాయపడుతున్నారు. హరితనిధిలో మేముసైతం భాగస్వాములమవుతామని ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతం
హరితనిధి ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతం. మేమంతా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. మా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు హరితనిధి ఆవశ్యకతను వివరిస్తాం. భావితరాలకు ఆక్సిజన్, స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలనే ప్రభుత్వ ఆలోచన గొప్పది. ఈ కార్యక్రమం కోసం అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి హరితనిధికి తమవంతు సహకారం అందించాలి. ఓ సామాజిక బాధ్యతగా హరితనిధికి మేము కూడా మావంతు నిధిని సమకూరుస్తాం.
హరితగ్రామంగా మార్చుతా..
హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించాం. నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ప్రధాన రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాటిన మొక్కలు పెరిగి నీడనిస్తున్నాయి. చెట్ల నీడన ప్రజలు సేదతీరడం చూస్తుంటే సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితనిధితో గ్రామాన్ని మరింత పచ్చదనంగా మార్చుతా. ప్రజల సహకారంతో వంద శాతం పూర్తి చేస్తాను.
నావంతు కృషి చేస్తా..
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించేందుకు నావంతు కృషి చేస్తా. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులను భాగస్వామ్యం చేయడం హర్షణీయం. ప్రభుత్వం ముందు చూపుతో మొక్కల పెంపకం చేపట్టడం సంతోషకరం.
మావంతు పాత్ర పోషిస్తాం..
హరితహారం ఫలాలు చూస్తున్నాం. దీనివల్ల పచ్చదనం పెరిగింది. ఆక్సిజన్ అందుతున్నది. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం విజయవంతం చేశారు. భవిష్యత్‌లోనూ ఈ కార్యక్రమం ఇలాగే సాగేందుకు హరితనిధి పేరిట ఫండ్ తయారు చేయడమనేది గొప్ప ఆలోచన. హరితనిధికి మావంతుగా డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా పిల్లలకు సైతం వివరిస్తాం. బంధువులు, స్నేహితులకూ కార్యక్రమం ఉద్దేశాన్ని చెబుతాం. హరిత తెలంగాణలో మా వంతు పాత్ర పోషిస్తాం.
హరితనిధి.. మనకు పెన్నిధి..
ప్రకృతి వైఫరీత్యాల నుంచి బయట పడేందుకు మనిషి తన చుట్టూ ఆకుపచ్చని ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఇప్పటికే హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. భవిష్యత్‌లో పచ్చదనాన్ని కాపాడుకునేందుకు హరితనిధి ద్వారా ప్రభుత్వానికి సహకారం అందించడం గొప్ప అవకాశం. నా పరిధిలో సాధ్యమైనంత ఎక్కువ మందిని హరితనిధికి సహకరించమని చెబుతా. హరితనిధి మనకు పెన్నిధి అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.