అయిజ, ఫిబ్రవరి 23: అంతర్రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు( Livestock show competitions) జోరుగా.. ఉషారుగా జరుగుతున్నాయి. ఆదివారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సేద్యపు టెద్దుల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు జరిగాయి. పోటీలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 10 జతల వృషభరాజములు తరలొచ్చాయి.
పోటీలను సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బహుమతుల దాత శ్రీరామ ట్రేడర్స్ అధినేత యుగంధర్ రెడ్డి ప్రారంభించారు. అట్టహాసంగా జరుగుతున్న పశుబల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులు అయిజకు తరలొచ్చారు. పశుబల ప్రదర్శన పోటీలు నడిగడ్డలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున జరుగుతుండటంతో రైతులు సంబర పడుతున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.