జోగులాంబ గద్వాల జిల్లా : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం తీవ్ర విషాదం నింపింది. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగాల శివారులో గురువారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో తండ్రి, కుమారుడు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం మెటార్ సైకిల్‌ను ఢీ కొట్టిన ఘటనలో రాయపురం గ్రామానికి చెందిన హనుమంతు, తిరుమలేశ్ ప్రాణాలు కోల్పోయారు. హనుమంతు భార్య లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం రాయపురం గ్రామానికి చెందిన హనుమంతు కుటుంబం ఎర్రవల్లి మండలంలోని ధర్మవరంలో నివసిస్తోంది. అక్కడ పొలాన్ని కౌలుకు తీసుకొన్న హనుమంతు.. పంట పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు. దేవర ఉత్సవం సందర్భంగా.. హనుమంతు, భార్య లక్ష్మి, కుమారుడు తిరుమలేశ్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై గట్టులోని బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం వీరు బండిపై తమ గ్రామానికి వస్తుండగా.. హనుమంతు మోటార్ సైకిల్‌ను ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తిరుమలేష్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. హనుమంతు భార్య లక్ష్మి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఒకే కుటుంబంలోని తండ్రీకొడుకు మృతి చెందడంతో రాయపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.