Ketidoddi PS | గద్వాల: కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ పై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్‌ను ఏఆర్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అటాచ్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాగుంట జాతర ఆవరణలో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్ ఫిట్నెస్ లేకపోవడంతో కేటిదొడ్డి పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడంతో వసూళ్ల వ్యవహారం బయటకు పొక్కినట్లు తెలుస్తోంది.
మరి కానిస్టేబుల్‌పై చర్యల విషయం జాతర్ల వసూళ్లదా..మరే ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిందా అనేది తేలియాల్సి ఉంది. కాగా గద్వాల జిల్లాలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ పై అనేక ఆరోపణలు గతంలోనే బయటకు వచ్చాయి. ప్రధానంగా కర్ణాటక నుంచి ఇసుక అక్రమ రవాణా, తెలంగాణ నుంచి కర్ణాటకకు పీడీఎస్ రేషన్ బియ్యం తరలిస్తున్న అక్రమార్కులతో నెలవారి సెటిల్మెంట్లు జరుగుతున్నాయనే ఆరోపణలు బలపడుతున్నాయి. దీంతోపాటు ఇతర ప్రైవేటు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సివిల్ కేసులు, భూవివాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా, పోలీస్ స్టేషన్లను ప్రైవేటు పంచాయతీ సెటిల్మెంట్ కేంద్రాలుగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ పై అనేక అవినీతి ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టి అవినీతికి మంగళం పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారా..? అనే అనుమానాలు వెలువడుతున్నాయి.