
విత్తనోత్పత్తి, ఉల్లినారుతో లాభాలు
తక్కువ విస్తీర్ణం, పెట్టుబడితో సిరుల దిగుబడి
వరికి బదులుగా పంట సాగు
ఆసక్తి కనబర్చుతున్న రైతన్నలు
మహ్మదాబాద్/గండీడ్, డిసెంబర్ 26: రైతన్నల పాలిట ఉల్లి పంట కల్పవల్లిగా మారింది. సిరుల దిగుబడి అందిస్తుండడంతో కర్షకుల కన్నీటిని తుడిచే పంటగా ఆదరణ పొందింది. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు కురిపిస్తున్నది. రూ.లక్ష ఖర్చుతో రూ.2 లక్షల ఆదాయం సమకూరుతున్నది. దీనికి తోడు విత్తనోత్పత్తితోపాటు ఉల్లినారు విక్రయంతోనూ లాభాలు ఆర్జించవచ్చు. పాలమూరు జిల్లా గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో వరికి బదులుగా యాసంగిలో ఉల్లి సాగుపై అన్నదాతలు దృష్టి సారించారు. వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు అందించి వారిని ప్రోత్సహిస్తున్నారు.
పంట సాగులో సతమతమవుతున్న రైతన్నల కన్నీటిని తుడిచే పంటగా ఉల్లి అన్నదాతలకు ఆదరణగా మారింది. అమ్ముకోవడానికి నిరీక్షణలేదు, డిమాండ్ లేదని దిగులులేదు.. కాసులతో కన్నీటిని తుడిచే పంట ఉల్లి. ప్రతి కూల వాతావరణంలో ఉల్లి సాగులో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. వరి, వేరుశనగ పంటలు తప్పా ఇతర పంటల సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి కనబర్చరు. కాని కొందరు ఉల్లిని సాగు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఉల్లి డిమాండ్ ఉన్న సమయంలో సాగు చేస్తే రైతులకు కాసుల వర్షం కురుస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో ఉల్లి కొరత ఉంటుంది. ఇదే సమయంలో పంటలు పండిస్తే రైతులకు పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. ప్రతికూల వాతావరణంలో ఉల్లి సాగు చేసి అధిక లాభాలు సాధించవచ్చని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు.
రైతులు ఉల్లిసాగును పెంచేందుకు విత్తనోత్పత్తితోపాటు ఉల్లినారును విక్రయించి సాగు పెంపుదలకు ప్రోత్సహిస్తున్నారు. రూ.లక్ష పెట్టుబడికి రూ.2లక్షల వరకు లాభాలు పొందుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉల్లినారును పెంచి లక్షల్లో లాభాలు రాబడుతున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సరైన పద్ధతిలో సాగుచేసి నారును విక్రయిస్తారు. విత్తనాలు పెట్టిన 40రోజులకు నారు చేతికి వస్తుంది. విత్తనాలను తయారు చేసేందకు ఉల్లిగడ్డలను నాటి విత్తనోత్పత్తి చేస్తారు. విత్తనాలు తయారైన తర్వాత అమ్మకోవడంతో పాటు పావు ఎకరంలో రూ.2లక్షల లాభాలు వచ్చే విధంగా నారును పెట్టి అమ్ముతుంటారు. ఉల్లి విత్తనాలు, ఉల్లినారు, ఉల్లిపంట ఇలా ఒకే పంటతో మూడు రకాల లాభాలు రావడం కేవలం ఉల్లి పంటకే సాధ్యమవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఉల్లి పంటకు అయ్యే పెట్టుబడి చాలా తక్కువ. పైగా ఎరువులు, రసాయన మందుల అవసరం ఉండదు. ఉల్లిసాగు పెద్దగా భారం ఉండదు. ధరలతో పెట్టుబడి వ్యయం పోల్చితే భారీగా ఆదాయం వస్తుంది. ఉల్లి సాగు చేస్తే ఎకరానికి వరికి రెట్టింపు లాభాలు ఆర్జించవచ్చని రైతులు చెబుతున్నారు. ఉల్లిసాగుపై రైతులను ప్రోత్సహిస్తే మరిన్ని లాభాలను ఆశించవచ్చంటున్నారు. ఎకరా, రెండెకరాలు ఇలా తక్కువ పొలం ఉన్నా కూడా తక్కువ నీటి వనరులతో ఉల్లి సాగుపై దృష్టి పెడితే పెద్ద రైతులతో సమానంగా లాభాలు పొందవచ్చు.