అచ్చంపేటరూరల్, ఫిబ్రవరి 13 : మండలంలోని ఘణపూర్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం పర్యటించింది. గ్రామ వీధుల్లో తిరిగి ప్రజలతో ముచ్చటించారు. పారిశుధ్య పనులను, డంపింగ్ యార్డ్‌లో తడి చెత్త, పొడి వేరు చేసే అంశంతోపాటు మరుగుదొడ్ల వాడకం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్వహణ తీరును పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు గురించి సర్పంచ్ రాజేశ్, ఇన్చార్జి ఎంపీడీవో వెంకటయ్యను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందం సభ్యుడు నరేశ్ మాట్లాడుతూ గ్రామంలో పర్యటించి పరిశీలించిన పలు అంశాలపై కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏపీవో మల్లేశ్, ఈసీ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, మాజీ వైస్ ఎంపీపీ సేవ్యానాయక్, ఉప సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
అమ్రాబాద్‌లో..
అమ్రాబాద్, ఫిబ్రవరి 13 : గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ప్రత్యేక సేవ కేంద్ర బృందం సభ్యులు అన్నా రు. మండలంలోని వటవర్లపల్లి గ్రామంలో ఆదివారం ఎస్ఎస్జీ సెంట్రల్ బృందం పర్యటించి గ్రామంలో ఎస్బీఎం బాత్రూంలు, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆలయ ప్రాంగణం, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ వారు విధిగా సేకరిస్తున్నారా.. లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఛత్రానాయక్, ఉపసర్పంచ్ అనసూయ, కోఆర్డినేటర్ మధు, ఎంపీడీవో ఇంద్రసేన, డీపీఎం నర్సింహులు, రేణయ్య, కార్యదర్శి రాంబాబు, వార్డు సభ్యులు రమేశ్, భరత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
బల్మూరులో..
బల్మూరు, ఫిబ్రవరి 13 : స్వచ్ఛ గ్రామాలుగా ఏర్పాటు చేసుకోవాలని స్వచ్ఛ స్వరక్షన్ రాష్ట్ర ప్రతినిధి సాయిబాబు, ఫారూక్ అన్నారు. ఆదివారం మండలంలోని తోడెలగడ్డ గ్రామంలో వారు పర్యటించారు. గ్రామంలో రోడ్లు, మురుగుకాలువలు, మరుగుదొడ్లు, ఇంకుడుగుంత తదితర పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవన్న, నర్సిరెడ్డి, సర్పంచ్ రమేశ్ ఉన్నారు.
లింగాలలో..
లింగాల, ఫిబ్రవరి 13 : మండలంలోని అంబట్పల్లి, దత్తారం గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులను ఆదివారం కేం ద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలకు విచ్చేసిన కేంద్ర బృందతో కలిసి సర్పంచులు నాగ రవిశంకర్, జంగమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి మరుగుదొడ్లు వాడకం, తాగునీటి కుళాయిల శుభ్రత, రోడ్లు ఏవిధంగా ఉన్నాయే పరిశీలించారు. అలాగే శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ప్రకృతివనం, హరితహారంలో నాటిన మొక్కల పెంపకం గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందాన్ని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నర్సింగరావు, డీపీవో కృష్ణ, సర్వే ప్రతినిధులు సుందర్, భార్గవ, లక్ష్మయ్య, స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్లు ఉశన్న, రాజేశ్, ఎంపీడీవో గీతాంజలి, ఎంపీవో కర్ణా పాల్గొన్నారు.