అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు
కల్యాణలక్ష్మితో పేదింట పెండ్లి భాజా
రాష్ట్రంలో 10 లక్షల మంది పెండ్లిండ్లకు సాయం
మెరుగైన వైద్య సేవల కోసమే సీఎంఆర్ఎఫ్
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 13: గూడులేని పేదలకు సొంతింటి కల నెరవేర్చుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వపనపర్తి 8వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వార్డు కౌన్సిలర్ విభూతి నారాయణలతో కలిసి 96 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్బెడ్రూం అందజేస్తామని చెప్పారు. వనపర్తి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణను వేగంగా చేపట్టినట్లు తెలిపారు. శ్రీనివాసపురం రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే ప్రతిపక్షాల నాయకుల కండ్లకు కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు.
కల్యాణలక్ష్మితో తీరిన పెండ్లి చింత
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వ సాయం అందించిందని, ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 210 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 56 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.26.46 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ అడుగులు వేస్తున్నదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముందు వరుసలో నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని కంటికి పాపలా చూసుకుంటున్నారని చెప్పారు. రైతుబంధు కింద 8 విడుతల్లో రూ.50,400 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు.
ఆడబిడ్డల పెండ్లి వారి తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా.. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షా116 అందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధులకు ఆసరాగా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలమైన సమయంలో కూడా సంక్షేమ పథకాలకు ఆటంకం రానివ్వలేదన్నారు. అనారోగ్యం బారిన పడి తమ స్థోమతకు మించి వైద్యానికి ఖర్చు చేసుకున్న పేద కుటుంబాలకు అండగా సీఎం సహాయనిధి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.2 వేల కోట్లు అందించినది తెలంగాణ సర్కార్ అన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు జంపన్న, భాష్యానాయక్, నాగన్న యాదవ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పోతులపల్లి రాజు, నాయకులు గోపాల్‌యాదవ్, రవినాయుడు, శివ తదితరులు పాల్గొన్నారు.