6,696 మంది రైతుల నుంచి 52,222 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
5,973 మంది రైతుల ఖాతాల్లో రూ.90.07కోట్లు జమ
ఆనందంలో అన్నదాత
గద్వాల, ఫిబ్రవరి 13: జిల్లాలో రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా కొనుగోలు చేసింది. రైతులను ఆదుకోవాలనే ఉద్ధేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలుకుండా రైతులకు మద్ధతు ధర కల్పించింది. ఈసారి వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 68కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వానకాలంలో పంట సేకరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకొని కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని సజావుగా సేకరించారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 68 కొనుగోలు కేంద్రాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారులు 68 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పీఏసీసీఎస్, ఐకేపీ, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించారు. ఈ ఏడాది జిల్లాలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి పంట ఎక్కువగా సాగు చేశారు. వానకాలంలో జిల్లాలో రైతులు 95,571 ఎకరాల్లో వరిసాగు చేశారు.
52,222 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో 68 కొనుగోలు కేంద్రాల నుంచి 52,222 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. సాగు అంచనాను బట్టి ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడి రావడంతో అంచనాలకు మించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులు పండించిన ప్రతిగింజనూ ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
రైతుల ఖాతాల్లో నగదు జమ
జిల్లాలో ఏర్పాటు చేసిన 68 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,696 మంది రైతుల నుంచి 52,222 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో 5,973 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.90,07,92,760 కోట్లు జమ చేశారు. వివిధ కారణాల చేత మిగతా రైతుల ఖాతాల్లో నగదు జమకాలేదు. మిగిలి పోయిన రైతుల ఖాతాల్లో నగదు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో నగదు అధికారులు జమ చేయనున్నారు.