కనుమరుగవుతున్న స్వచ్ఛ ప్రేమ
చిన్న వయసులోనే ఆకర్షణలు
ఆధునికత ముసుగులో హైటెక్ ప్రేమలు
జీవితాలు నాశనం చేసుకుంటున్న యవత
నేడు ప్రేమికుల దినోత్సవం..
ఆత్మకూరు, ఫిబ్రవరి 13;ప్రేమ రెండు అక్షరాలు.. రెండు జీవితాలు.. కుటుంబాల కలయిక. ప్రేమ అనే ఒక్క పదం కొన్ని జీవితాలను ముడివేస్తుంది. ప్రతి మనిషిలోనూ ప్రేమ చిగురిస్తుంది. అయితే కొందరిలోనే మొక్కై.. చట్టై.. సంతోషపు పువ్వులు, పండ్లను కాయిస్తుంది. మరికొందరి జీవితాల్లో చిగురించిన కొద్ది రోజులకే విషాదం మిగులుస్తుంది. ఏదేమైనా ప్రేమించిన మనిషికి తాను జీవించి ఉన్నన్ని రోజులు ‘ప్రేమ’ అనేది ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వస్తుందంటే ప్రేమను వ్యక్తపర్చుకోవాలనే వారికి ఓ పరీక్ష.. ప్రేమలో ఉన్నవారికి పండుగదినం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఓ శుభదినం.. ప్రేమలో ఓడిన వారికి మాత్రం దుఃఖాన్ని గుర్తుచేస్తూ ఆనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషించే ఓ గొప్పదినం..
ఎందుకని ఈరోజే..
అప్పటి రోమన్ చక్రవర్తి 2వ క్లాడియన్ క్రీ.పూ. 270లో తన సామ్రాజ్యంలో ప్రేమ వివాహాలు చేసుకోరాదని నిషేదం విధించాడు. ఆ దేశంలో వాలెంటైన్స్ అనే ప్రేమ విలువ తెలుసుకొని ప్రేమ జంటలకు వివాహాలు చేయించి ప్రోత్సాహించేవాడు. ఇది నచ్చని క్లాడియన్ చక్రవర్తి వాలెంటైన్స్‌కు శిరచ్ఛేద శిక్ష విధించాడు. ఫిబ్రవరి 14నే ఆ శిక్ష అమలుజరిగింది. అందుకే ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్స్ జ్ఞాపకార్థం ప్రపంచమంతా ఆరోజున ప్రేమికుల దినోత్సవం జరుపకుంటుంది.
ప్రేమ అనే..
ప్రేమ అనేది జగత్ వ్యాపితం. ఆ రెండు అక్షరాల నుంచి వచ్చే వెలుగు ప్రపంచాన్ని స్వచ్ఛంగా పునీతం చేసే వెన్నెల వంటిది. వేదకాలం నుంచి కంప్యూటర్ యుగం వరకు ప్రపంచంలో జరిగే సమస్త మహాత్కార్యాలకు ఆ రెండు అక్షరాలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రేమామృతాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ జరుపుకొనే ప్రేమికుల దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. నేడు అనేక మంది తమ తమ ప్రేను వ్యక్తం చేయడానికి ఈ రోజుని వినియోగించుకుంటారు. అయితే సంప్రదాయ అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన్ని వాటి సరిహద్దుల్లో జరుపుకోవడమే ఉత్తమమని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
మారిన ప్రేమ..
పట్టణాల్లో ప్రేమికులైతే ప్రేమికుల దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకొంటారు. గ్రీటింగ్ కార్డులు, బహుమతులు అందించుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆ జోరు తగ్గింది. ఉరుకులు, పరుగుల జీవితంలో సమయం లేక వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా తమ ప్రేమను పంచుకుంటున్నారు. ఒకప్పుడు యుక్తవయస్సులోకి వచ్చాకే తెలిసే ప్రేమ.. ప్రస్తుత రోజుల్లో పాఠశాల స్థాయిలోనే మొగ్గ తొడుగుతోంది. పెరిగిన అత్యాధునికత్వం వీరిని మరింత హైటెక్ ప్రేమలోకి దింపుతోంది. పగలు, రేయి తేడా లేకుండా సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి తనాన్ని ప్రేరేపిస్తుంది.
కౌమారంలో అవగాహన కల్పించాలి
ప్రేమ.. ఓ తియ్యని అనుభూతి. ప్రతి వ్యక్తి దీనిని ఆస్వాదించడం సహజం. జీవితంలో ఇదొక భాగం. ఏదో ఒక సందర్భంలో ప్రతీ ఒక్కరూ దీన్ని అనుభవించాల్సిందే. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. యోగుల నుంచి భోగుల వరకు దీని గురించే వర్ణించారు. అయితే ఈ పదం లవర్స్ విషయంలో పొందిన ప్రాచుర్యం మిగితా అంశాల్లో గుర్తింపు లేకపోయింది. ప్రేమ అనేది రెండు అక్షరాలే.. అయితే ఎంతో వ్యాపారం జరుగుతోంది. గిఫ్ట్‌ల రూపంలో ప్రతీ ఏడాది వేలకోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోందని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ రెండక్షరాలే సినిమా పరిశ్రమకు 75 శాతం ఆధారం. ఈ ముడి పదార్థం ఆధారంగా ఎన్నో ప్రేమకథలను అల్లి యువత మీదకు వదులుతున్నారు. మీడియా ప్రభావంతో తెలిసీ తెలియని వయస్సులో కౌమారదశలో ఉన్న యువత ఇదే ప్రేమనుకొని తప్పటడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారితో కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్న సందర్బాలు కోకొల్లలు. ప్రేమకు కవులు ఎన్నో భాష్యాలు చెప్పారు. లవ్ (ప్రేమ)- లాస్ట్(కోరిక) ల మధ్య తేడాలను గుర్తించినప్పుడు ప్రేమ శాశ్వతమవుతుంది. కౌమారదశలో ఉన్న యువతకు సంబంధిత కళాశాలల్లో ప్రేమకు, ఆకర్షణకు గల తేడాలను వివరించి వారిలో అవగాహన కల్పించడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మొబైల్ యుగంలో పదో తరగతి నుంచే అవగాహనలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
తల్లిదండ్రులు ప్రేమను పంచాలి
తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచి ప్రేమను పంచాలి. ప్రతీ విషయంలో పిల్లలను తట్టి, స్పర్శిస్తూ చేరదీయాలి. మంచి పని చేసినప్పుడు అభినందిస్తూ స్పర్శించాలి, మనోధైర్యం కోల్పోయినప్పడు దగ్గరకు తీసుకొని ఓదార్పునివ్వాలి. ఈ ప్రేమతత్వంతో పిల్లలు తమ తల్లిదండ్రులకు ఆకర్షితులవుతారు. తమకు కల్గిన భావాల్ని పిల్లలు తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలుగుతారు. అప్పుడే పిల్లలు చేసే తప్పుల్ని తల్లిదండ్రులు సరిదిద్దగలుగుతారు. తప్పుదారిన పడకుండా కాపాడుకోగలుతారు.