గద్వాల టౌన్, జూలై 6 : గద్వాల సంస్థానానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది.. కళలకు.. భక్తికి పెట్టింది పేరుగా సంస్థానం విరాజిల్లింది. అందుకే కళలకు, కళాపోషణకు పుట్టినిల్లుగా, విద్వద్గద్వాలగా పేరుగాంచింది…అందులో చెప్పుకోదగ్గది సంస్థానాదీశుల ఇలవేల్పు శ్రీ భూలక్ష్మీచెన్నకేశవ ఆలయ సమూదాయం. ఆలయ నిర్వహణ మొత్తం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరిగేది. నిత్య పూజలు, అభిషేకాలు కనుల పండవగా సంస్థానాధీశులు నిర్వహించే వారని ఇప్పటికీ చెప్పుకుంటారు.
అలాగే శ్రీ రామాలయం, శ్రీవేణుగోపాల స్వామి ఆలయాల్లో కూడా స్వామివార్లకు పూజలు ఘనంగా నిర్వహించేవారు. సంస్థానాదీశుల మొదటితరం నుంచి మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ వరకు వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. కానీ మంత్రాలయ మఠంవారికి అప్పగించిన తరువాత నాటి సంస్థానాధీశుల సంస్కృతిని, సాంప్రదాయానికి పూర్తిగా తూట్లు పొడిచారు. ఆలయ అభివృద్ధి పేరిట నాటి జ్ఙాపకాలను, కట్టడాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే శివాలయం. అల్వాల్ల మండపాలు, హోమ మందిరం ఇలా అన్నీ వారి కార్యాలయాలుగా మారిపోయాయి. శ్రీకృష్ణాలయం పక్కన ఉన్న మఠపురిని తొలగించి అడ్డుగోడను నిర్మించారు. తాజాగా మరో వివాదానికి మఠం నిర్వాహ కులు తెరలేపారు. దీంతో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి. అయినా మా ఇష్టమొచ్చినట్లు మేము చేస్తాం, మీరెవరు అడిగేందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
గద్వాల కోట 17వ శతాబ్దంలో నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతున్నది. సంస్థానం మట్టి కోట నిర్మాణంతో దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నది.
ముఖ్యంగా నిజాం సంస్థానంలో స్వతంత్ర సంస్థానంగా విరాజిల్లింది. కోటలోని శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీకృష్ణుడి ఆలయం గద్వాల సంస్థానాదీశుల దైవభక్తిని ఎంతగానో చాటుతున్నది. ఇక్కడ ఉన్న శిల్ప సంపద ఆమోఘమనే చెప్పవచ్చు. కానీ కాలక్రమేణా సంస్థానాదీశుల పాలన రద్దు కావడంతో కోట, కోటలోని ఆలయాలు ప్రాశస్తాన్ని కోల్పోయే ప్రమాధం వాటిల్లింది. కోట సంరక్షణను సంస్థానాదీశుల వంశస్థులు పట్టించుకోకపోవడం, పాలకులు, పురావస్తుశాఖ కానీ పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది.
సంస్థాన కాలంలో నిత్యపూజలతో విరాజిల్లిన స్వామి వారు దూప దీప నైవేద్యానికి నోచుకోలేకపోయాడు. కొందరు స్వార్థపరుల కారణంగా ఆలయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఇది గమనించిన మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి 2007లో ఆలయాలన్నింటినీ మంత్రాలయ పీఠానికి చెందేలా సంస్థానాదీశుల వంశస్తురాలైన లతాభూపాల్తో ఒప్పించి మఠానికి ధారదత్తం చేయించారు. అలాగే రథశాల కొన్ని ఆస్తులను కూడా పీఠానికి చెందేలా చొరవ తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రాలయ మఠం వారే భక్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.
మఠం ఆధీనంలోకి ఆలయాలు వెల్లడంతో సంస్థానాదీశుల సంస్కృతి, సంప్రదాయానికి తూట్లు పొడిచారన్న ఆరోపణలు భక్తుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నిర్వహించాల్సిన పూజలు నిర్వహిచడం లేదన్న విమర్శలున్నాయి. ప్రధాన ఆలయ ధ్వజ స్థంభ ప్రతిష్టలోప భూయిష్టంగా ఉందని చరిత్రకారుల చెప్తున్నారు. సంస్థానాధీశుల కాలంలో ఉన్న కట్టె ధ్వజ స్థంభం స్థానంలో రాతి ధ్యజ స్థంభం ఏర్పాటు చేయడంపై కూడా భక్తులు, చరిత్రకారుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నది. గతంలో ఉన్న అల్వాల్ల విగ్రహాలను తొలగించి కనుమరుగు చేశారు. హోమ శాల, శివాలయం ఆనవాళ్లు లేకుండా చేశారు.
ఆలయ నిర్వాహకుల వ్యక్తిగత నిర్ణయాల కారణంగా రోజు రోజు భగవంతుడికి భక్తులు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. సంస్థాన కాలం నాటి వైభవం వచ్చిందన్న భక్తుల సంతోషాన్ని నిర్వాహకులు నీరుగారుస్తున్నారు. 9సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ భగవంతుడికి సేవ చేస్తున్న భక్తులపై ఆలయంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఇష్టానుసారంగా దూషించడంతో వారు తీవ్ర మనస్థాపానికి గురై ఆలయానికి వెళ్లడం లేదు. అలాగే ఆ వ్యక్తి కారణంగా స్థానిక బ్రాహ్మణులు సైతం ఆలయానికి రావడం లేదు. అంతేకాకుండా మఠానికి సంబంధించిన మేనేజర్లు ఒక ఏడాదిలోనే ఆరుగురుకు పైగా మారడంలో ఆ వ్యక్తి ప్రమేయం బలంగా ఉందన్నది భక్తుల నుంచి వినిపిస్తున్న మాటలు.
పురాతన కట్టడాలను పరిరక్షిస్తామన్న పురాతన కట్టడాల పరిరక్షణ సమితికి కట్టడాల కూల్చివేత కనిపించడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణ తమ బాధ్యతన్న కలెక్టర్ కట్టడాలు కూల్చివేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ భక్తులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సంస్థాన కాలం నాటి అపురూప కట్టడాలు, నిర్మాణాలు అభివృద్ధి మాటున కనుమరగువుతున్నాయి. మంత్రాలయ మఠం ప్రమేయం లేకుండా స్థానిక నిర్వాహకులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆలయం పక్కనే ఉన్న మఠపురిని పూర్తిగా తొలగించారు. చెదల పేరు చెప్పి కట్టె ధ్వజ సంభాన్ని తొలగించి రాతి ధ్వజ స్థంభాన్ని నెలకొల్పారు.
తాజాగా శ్రీ రామాలయం వెనుక బాగాన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మట్టి కోట పైకి వెళ్లే మెట్ల మార్గాన్ని పూర్తిగా తొలగించారు. నాలుగు చక్రాల బండి కోటపైకి వెళ్లేందుకు వీలుగా ఉన్న దారిని తొలగించారు. గుర్రపుశాలను తొలగించారు. ఇలా ఎన్నో కట్టడాలను తొలగించడంపై ప్రజలు, చరిత్రకారులు ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.