అయిజ, జూన్ 6 : గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో బుధవారం ఇథనాల్ ఫ్యా క్టరీ పనులను రైతులు అడ్డుకున్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో కంపెనీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారన్న యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు 40 మంది రైతులపై కేసులు బనాయించి 12 మందిని గురువారం రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లా అఖిలపక్షం నాయకులు శుక్రవారం పెద్ద ధన్వాడకు అయిజ మీదుగా బయలుదేరారు.
అయితే సమాచారం అందుకున్న అయిజ ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కర్నూల్ రోడ్డులోని చిన్నతాండ్రపాడు రహదారిపై వారి వాహనాలను అడ్డగించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, వెంకటస్వామి, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్‌యాదవ్, బహుజన రాజ్య సమితి నాయకులు వా ల్మీకి, వినోద్, ఉప్పేర్ నర్సింహతోపాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని కొద్ది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్న రైతులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం అప్రజాస్వామికమని అఖిలపక్షం నేతలు ధ్వ జమెత్తారు. రైతులపై దాడులు చేసి వారిని గాయాలపాలు చేసిన పరిశ్రమ యాజమాన్యం, ప్రైవేటు సై న్యంపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
వ్యవసాయానికి అనుకూలమైన సాగు భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించి, పరిశ్రమలు వద్దని వారిస్తున్న రైతులపై నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజ లు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. తక్షణమే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రిమాండ్‌కు పంపిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. అనంతరం సొం తపూచీకత్తుపై అఖిలపక్ష నాయకులను విడుదల చేశారు.