వనపర్తి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పేదలకు కడుపునిండా తిండి పెట్టాలనే లక్ష్యంతో ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. రూపాయికే కిలోబియ్యం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా కాలంలో ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం అందజేసింది. కొవిడ్ నేపథ్యంలో పూట గడవడం కష్టంగా మారిన తరుణంలో సీఎం కేసీఆర్ ఉచితంగా బియ్యం అందజేసి ప్రజలను ఆదుకున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ పొంచి ఉన్న నేపథ్యంలో మరో మూడు నెలల పాటు ఉచితంగా బియ్యం అందజేయాలని నిర్ణయించింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఇవ్వనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మంగళవారం డిసెంబర్ బియ్యం కేటాయింపులకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం నుంచి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.
పంపిణీ ప్రక్రియ ఇలా..
రేషన్‌కార్డుల ఆధారంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డు లబ్ధిదారుల్లో ఒక్కరికి ఐదు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుపై 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుపై 10 కిలోల బియ్యాన్ని అందజేయనునారు. అంత్యోదయ కార్డు ఉన్న వారికి కిలో చక్కెరకు రూ.13.50 తీసుకొని ఇవ్వనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 5 కిలోలు, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లో 3, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మున్సిపాలిటీ పరిధిలో కిలో గోధుమలకు రూ.7 తీసుకొని ఇవ్వనున్నారు. వనపర్తి జిల్లాలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 1,47,259, అంత్యోదయ కార్డులు 10,015, అన్నపూర్ణ కార్డులు 114.. మొత్తం 1,57,388 కార్డులు ఉండగా, 5,25,683 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 28,34,220 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. చౌకధరల దుకాణాల్లో ‘బియ్యం ఉచితం’ అని బోర్డులు ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.