నాగర్ కర్నూల్: కమ్యూనిస్టు యోధుడు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Gummadi Narsayya) రాజకీయ ప్రస్థానం, ప్రజానికానికి చేసిన పోరాటాలు, నిరాడంబరత, అందరికీ స్ఫూర్తిదాయకమని శాసన మండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి( MLC Damodar Reddy) అన్నారు.
శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో సీఎన్ఆర్ ( CNR ) విద్యాసంస్థల ఆధ్వర్యంలో చింతలపల్లి నిర్మలాదేవి నారాయణ రావు జీవన సాఫల్య పురస్కారాన్ని గుమ్మడి నర్సయ్యకు అందజేసి శాలువా, మెమొంటో సత్కరించి రూ. 25 వేల నగదును అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కమ్యూనిస్టుగా ఆయన జీవితం ప్రజలకు అంకితం చేశాడని అన్నారు.
అవార్డు గ్రహీత గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో తన సేవలను, జీవితాన్ని గుర్తించి సీఎన్ఆర్ విద్యాసంస్థలు అవార్డు ఇవ్వడం గర్వకారణమన్నారు. తన జీవితాంతం కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటూ ఇల్లెందు ప్రజల గొంతుకగా నిస్వార్థ సేవ చేస్తానని పేర్కొన్నారు.
సమసమాజం కోసం, పేదరిక నిర్మూలనకోసం కూలిరేట్లకోసం, గిట్టుబాటు ధరలకోసం పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని, ఆదివాసీ గిరిజనులకు పట్టాలివ్వాలని కోరారు. కమ్యూనిజం పోయిందని బాధపడాల్సిన అవసరం లేదని, తరతరాలుగా త్యాగాలు చేసి కమ్యూనిస్టు పార్టీ పేదలకోసం పనిచేసిందని, అదే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి చింతలపల్లి భాస్కర్ రావు సభాధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర నాయకులు బాల్ నర్సింహ, ఆనంద్ జీ, సీపీఎం నాయకులు వర్దం పర్వతాలు, ఆర్.శ్రీనివాస్, ఐద్వా సంఘం అధ్యక్షురాలు కందికొండ గీత, ఉపాధ్యక్షురాలు ఎస్.ఎల్. పద్మ, గుమ్మడి నర్సయ్య కూతురు ప్రొఫెసర్ అనురాధ, ప్రజాపంథా నాయకులు కృష్ణ, బయోపిక్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే, డాక్టర్ నూర్జహాన్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, నాగవరం బాల్ రాం, డాక్టర్ రామ్ కిషన్, సమన్వయ కర్తలు వనపట్ల సుబ్బయ్య, కందికొండ మోహన్, కల్వకోలు మద్దిలేటి, పి.వహీద్ ఖాన్, ఎదిరెపల్లి కాశన్న,ముచ్చర్ల దినకర్, వెంకటపతి గుడిపల్లి నర్సింహ్మా రెడ్డి , కాశీదాసు, ఆర్కల రాజేష్, విష్ణుమూర్తి, గాయకుడు సత్తార్, గుడిపల్లి నిరంజన్, సి.భాస్కర్ రావు, కుటుంబ సభ్యులు వెంకటేష్ చంద్రకళ, కవిత, ఫస్టియోద్దీన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.