మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20 : బతుకుదెరువు కోసం వెళ్లిన పాలమూరు యువకుడిని ఆ మెరికా పోలీసులు అన్యాయంగా కాల్పులు జరి పి హతమార్చడం భాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ అమెరికాలోని కాలిపోర్నియాలో పోలీసు కాల్పుల్లో మృతిచెందగా, శనివారం బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు.
ఆమెరికాలోని తెలుగు అసోషియేషన్ నేతలను సంప్రదించి పాలమూరుకు నిజాముద్దీన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మాట్లాడారు. కాలిఫోర్నియాలో జరిపిన కాల్పుల్లో మరణించిన నిజాముద్దీన్ మృతదేహం 14రోజులుగా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌గౌడ్ మృతదేహాన్ని తెప్పించేందుకు చర్యలు తీసుకోవడంతో బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి వెంట మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్, జావేద్ బేగ్ తదితరులు ఉన్నారు.