వనపర్తి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఆత్మవిశ్వాసం లేకనే రెండేళ్లు వేచి చూసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించా రు. ఎట్టకేలకు కోర్టుల ఒత్తిడి మేరకు ఎన్నికలకు దిగి వచ్చిన రేవంత్ సర్కారుకు ఓటర్లు తగిన రీతి లో గుణపాఠం చెబుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని సింగిరెడ్డి నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు, రైతులు, కార్మికులు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు బాసటగా నిలిచిందన్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధం గా తెలంగాణలో అధిక జీతాలను కేసీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు. రేవంత్ అబద్ధపు హామీలను రాష్ట్రంలోని ఇతరులు నమ్మినట్లుగానే ఉద్యోగులు కూడా నమ్మి మోసపోయి మదనపడుతున్నారన్నా రు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటే రాష్ట్ర ఉద్యోగులకు అధిక వేతనాలు ఉండేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హా మీని అమలు చేయలేని దుస్థితిలో ఉందన్నారు. కోర్టు తీర్పుతో తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికలకు దిగిరావాల్సి వచ్చిందని, స్వయ ంగా సీఎం పర్యటనలు చేసి ఉన్నతాధికారులకు ఎన్నికలపై ఓ సాంకేతాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థలు అనుకూలంగా రావడం ఆనవాయితీగా వస్తుందని, అయితే ఇక్కడ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ జీపీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని, పాలనపై విశ్వాసం లేనందునే ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు కేవలం పదిశాతం కూడా గ్రామ పంచాయతీ సీట్లు రాలేదని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి సాకులు చూపకుండా మీ పాలనపై నమ్మకముంటే పార్టీల గుర్తులతో కూడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ విధ్వంసమైందని మొ దటి నుంచి బుకాయిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతున్నారన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను తికమక చేసేందుకు అప్పుల వాదనతో తప్పించుకుంటున్నారని, దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం గతంలో అనేక కేంద్ర అవార్డులు పొందిన విషయాలను ఎవరూ మరిచిపోలేదన్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్రపంచస్థాయి సమ్మిట్లోనూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వెలుగెత్తి మాట్లాడిన తీరును నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నమ్మకం అనేమాట ప్రజల్లో కిలోమీటర్ల దూరం లోతుకు వెళ్లిపోయిందని జీపీ ఎన్నికలు రుజువు చేస్తున్నాయన్నారు.
ప్రస్తుత పంచాయతీ ఎన్నికలపై ప్రజలు చాలా క్లీయర్‌గా ఉన్నారని, పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఓటర్లు కచ్చితమైన తీర్పును ఇస్తున్నారన్నారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా అధికార యంత్రాంగం వ్యవహరించాలని, సోలీపూర్‌లో ఒకే ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన ఘటనపై కోర్టుకు వెళ్తున్నామని, ఇందులో అధికారుల పాత్రపైన దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. సమావేశం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు రమేశ్‌గౌడ్, కృష్ణానాయక్, జగదీశ్వర్‌రెడ్డి, నందిమళ్ల అశోక్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నాగన్న యాదవ్, శ్రీనివాస్, గులాం ఖాదర్ పాల్గొన్నారు.