వనపర్తి, జూలై 14 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్లో యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నదని, కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 30శాతం సీట్లు యువ నాయకులకు కేటాయించి భావితరానికి నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. స్వార్థపరులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారని, వారికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంక్షేమ పథకాలకు ఎగనామం పెడుతున్నారని మండిపడ్డారు. యువతకు 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి, పది పాసైన వారికి రూ.10వేలు, డిగ్రీ చదువుకు రూ.25వేలు, విద్యార్థి భరోసా కింద రూ.5లక్షల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలకు వివరించాలన్నారు. అభిప్రాయ సేకరణతో రైతులను నట్టేట ముంచాలని కాంగ్రెస్ చూస్తున్నదన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను తులం బంగారం, మహిళలకు రూ.2,500 నగదు, కేసీఆర్ కిట్టు, గ్యాస్ సబ్సిడీ, విద్యార్థినులకు స్కూటీలపై నిలదీస్తున్నారని చెప్పారు. హామీల అమలు కోసం నిర్మాణాత్మక ఉద్యమాలు చేస్తామన్నారు. 14ఏండ్ల ఉద్యమం చేసి శూన్యంలో సునామీ సృష్టించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎందరో యువ నాయకులను తయా రు చేశారని గుర్తుచేశారు. అలాగే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను నాయకులుగా తయా రు చేస్తామన్నారు.
ప్రతి మండలంలోని యువ, విద్యార్థి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి యువశక్తిని తయారు చేస్తామన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు విజయ్‌కుమార్, నందిమల్ల అశోక్, మన్యం, యువత అధ్యక్షుడు గిరి, రాము, హేమంత్, కార్తీక్, జోహెబ్, అఖిలేందర్, యుగందర్‌రెడ్డి, రఘు, పుష్పక్, సురేశ్, రవి, సుబ్బు, సునీల్, యాదగిరి, శివ, గోవిందు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.