జడ్చర్ల, జూన్ 16: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో సోమవారం నిర్వహించిన మెగా ఉచితవైద్య శిబిరాన్ని మాజీ మంత్రి డా.సి.లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే. శ్వేత లక్ష్మారెడ్డి జ్ఞాపకార్ధం కోడుగల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ వీఎస్ హాస్పిటల్ వైద్య బృందం, డాక్టర్ భరత్ నందన్ రెడ్డి సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోడుగల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు శిబిరానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె, కంటి, చర్మ వ్యాధులు, దంతాలు, టీవీ, బీపీ, షుగరు తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ ఎక్స్రే తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోడుగల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు ఈ వైద్య శిబిరంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తామని తెలిపారు.