మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 30 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం భిన్నరుచుల సమ్మేళనంతో ‘టేస్టీ ఫుడ్ ఫెస్టివల్-2025’ నిర్వహించారు. విద్యార్థినులే స్వయంగా రకరకాల వంటలతోపాటు చిరుతిళ్లను తయారు చేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్లో తెలంగాణ వంటకాలైన పులిహోరా, రాగిజావ, రవ్వలడ్డూ, సున్నుండలు, జొన్నరొట్టెలు, దోసకాయపప్పు వంటి సంప్రదాయ వంటకాలతో పాటు మీట్ అండ్ వెజ్ బాల్బిర్యానీ, ఫైనాఫిల్ కేక్, చాక్లెట్కేక్, పానీపూరీ, చాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుత కాలంలో విచ్చలవిడిగా కళ్లకు ఆకట్టుకునే, నోటికి రుచిని అందించే విధంగా ఉండే రంగురంగుల ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానిచేస్తాయంటూ ఏ రకమైన ఆహార పదార్థాలను తింటే శరీరంలోని ఏ అవయవానికి ఉపయోగపడుతుందో విద్యార్థినులు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ వంటకాలే ఆరోగ్యదాయకం అన్నారు. విద్యార్థినులు చదువుతోపాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను ఆహారపదార్థాల ప్రాధాన్యత గురించి తెలియజేయడానికి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ దోహదపడతాయన్నారు.
ఈ ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థినులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రిన్సిపల్‌తో పాటు న్యాయనిర్ణేతలతో అమీనా ముంతాజ్ జహాన్, ప్రవీణ్‌కుమార్, హరిబాబు తదితరులు రుచి చూసి విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతి షిరీన్ ఫాతిమా, ద్వితీయ బహుమతి సుమే రా, తస్లీమ్, తృతీయ బహుమతి షబానా, నాజి యా, సమ్రాన్, ఐమన్ సాధించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పద్మ, అనురాధ, అమీనాముంతాజ్ జహాన్, మైక్రోబయాలజీ విభాగాధిపతి జే.శ్రీదేవి తదితరులు ఉన్నారు.