వానకాలం వస్తే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటేవారు. వంతెన నిర్మించాలని కనిమెట్ట, పాత జంగమాయపల్లి గ్రామాల ప్రజలు 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యేలకు, సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం. ఉద్యమ సమయంలో సమస్యలను కండ్లారా చూసిన ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బ్రిడ్జి నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఊహించారు. స్వరాష్ట్ర పాలనలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆల బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయించారు. కానీ వాగులో లోతు ఎక్కువగా ఉండడం వల్ల నాణ్యవంతంగా నిర్మిస్తేనే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు ఉండవని భావించి ఎమ్మెల్యే ఎస్టిమేషన్ను రీటెండర్ చేయించారు. 2022 ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కనిమెట్ట బ్రిడ్జి శంకుస్థాపన పనులను మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల ప్రారంభించారు. దాదాపు 30శాతం పనులు పూర్తికాగా మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
– వనపర్తి, ఏప్రిల్ 21
ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. అందుకు.. 40 ఏండ్లుగా ఎదురుచూస్తున్న కొత్తకోట మండలం కనిమెట్ట శివారులోని ఊకచెట్టు వాగు మీద రూ.12.40కోట్లతో నిర్మిస్తున్న కనిమెట్ట బ్రిడ్జే నిదర్శనం. కనిమెట్ట వంతెనను అధునాతన పద్ధతిలో నిర్మిస్తున్నారు. వాగు ఉధృతిని తట్టుకునేలా 12 పిల్లర్లతో బలిష్టంగా బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. 15 అడుగుల లోతులో నాలుగు పిల్లర్లతో బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 17 పిల్లర్ల కింద 40 పిల్లర్లను బెడ్‌తో పటిష్టంగా నిర్మిస్తున్నారు.
14 గ్రామాలకు ఊరట
వానకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రతిసారీ ఎంపీపీ గుంత మౌనిక, కనిమెట్ట సర్పంచ్ రాణి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయించేవారు. అత్యవసరమైతే పుట్టిలో ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ప్రయాణించేవారు. కనిమెట్ట మినహాయించి మిగతా 13 గ్రామాల ప్రజలు కొత్తకోట హైవే మీదుగా హైదరాబాద్, కర్నూల్ నగరాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చేది. బ్రిడ్జి నిర్మాణంతో ప్రధానంగా పాత జంగమాయపల్లి, ముత్యాలంపల్లె, వర్ణె, పేరూర్, ఇక్రంపల్లి, కౌకుంట్ల, కురుమూర్తి, కిష్టంపల్లి, వెంకటగిరి, పుట్లంపల్లి, గోపన్‌పల్లి, వంటి గ్రామాలకు రహదారి సమస్య తీరనున్నది.
ఆరునెలల్లో పూర్తి చేస్తాం
40 ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల సమస్యకు బీజం పడింది. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి ఎస్టిమేషన్ను తయారు చేయించారు. బ్రిడ్జిని అధునాతన పద్ధతిలో పటిష్టంగా నిర్మిస్తున్నాం. కష్ట సుఖాలు చూసిన నాయకుడు సీఎం కేసీఆర్ ప్రజల సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రూ.12.40కోట్లతో బ్రిడ్జి పనులను ప్రారంభించి ఆరునెలల్లో పూర్తి చేస్తాం..
ఎమ్మెల్యే ఆల చొరవతోనే..
చిన్నప్పటి నుంచి ఈ సమస్యను కండ్లారా చూశాను. చదువుకునే సమయంలో పక్క గ్రామాల నుంచి వచ్చే వారు వాగు పారే సమయంలో పుట్టీల్లో వచ్చేవారు. కొంతమంది చదువులను కూడా ఆపుకొనేవారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య అలాగే మిగిలిపోయింది. ఎమ్మెల్యే ఆల చొరవతో ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమవడం.. నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు పూర్తి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– రాణి, కనిమెట్ట సర్పంచ్
అభివృద్ధే ఎమ్మెల్యే ‘ఆల’ లక్ష్యం
ప్రజాభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆల పనిచేస్తున్నారు. వానకాలంలో వస్తే చాలు ఏదో తెలియని భయం ఉండేది. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రజలు పుట్టీలు, ట్రాక్టర్లలో ప్రయాణం కొనసాగించేవారు. వారి బాధను చూసి మూడుసార్లు తాత్కాలిక రోడ్డు వేయించినా కొట్టుకుపోయింది. అలాంటి సమస్యకు ఎమ్మెల్యే ఆల శాశ్వత పరిష్కారం చూపించారు. నేను ఎంపీపీగా ఉన్న సమయంలో వంతెన నిర్మాణానికి పునాదులు పడడం, ప్రజల సమస్య తీరడం ఎప్పటికీ మర్చిపోలేను.
– గుంత మౌనిక, ఎంపీపీ, కొత్తకోట
బ్రిడ్జి నిర్మాణమే సమస్యకు పరిష్కారం
వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు పుట్టీల్లో దాటేవాళ్లం. లేదంటే చుట్టూ తిరిగిపోవాల్సి వచ్చేది. ఎమ్మెల్యే ఆల చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి బాటలుపడ్డాయి. దీంతో సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరికింది. వంతెన పూర్తయితే వానకాలంలో కూడా నేరుగా హైవేకు వెళ్లేందుకు
వీలుంటుంది.
– వేపాల్రెడ్డి, పాత జంగమాయపల్లి