ఊట్కూర్ : ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మక్తల్ సీఐ రామ్‌లాల్ అన్నారు. రాబోయే బక్రీద్ ( Bakrid festival ) పండుగను దృష్టిలో ఉంచుకుని గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై కృష్ణంరాజు అధ్యక్షతన శాంతి కమిటీ ( Peace Committe ) సమావేశం నిర్వహించారు.
సమావేశానికి మక్తల్ సీఐ రామ్‌లాల్ ( CI Ramlal ) హాజరై మాట్లాడారు. ముఖ్యంగా ఖురేషిలు గోవులను వధించరాదని, చిన్న ఎద్దులను కొయ్యరాదని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేసిన పశువులను మాత్రమే వధించాలని, అక్రమంగా గోవులను వధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు.
ఎవరికి ఎలాంటి సమాచారం అందినా, గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న డయల్ 100 గాని, సంబంధిత పోలీసులకు గాని సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణాను నిరోధించేందుకు అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై కృష్ణంరాజు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు, ఖురేసీలు పాల్గొన్నారు.