భూత్పూర్ : రైతులూ పంటలతోపాటు భూసారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని డాట్ సెంటర్ వ్యవసాయ శాస్త్రవేత్త భరత్ భూషణ్ ( Scientist Bharat Bhushan ) కోరారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో ( Agriculture ) ఎన్నో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులు సేంద్రియ ఎరువులను పూర్తిగా మరిచి రసాయన ఎరువులపైనే రైతులు ఆధారపడుతున్నారని తెలిపారు. ఇది భవిష్యత్తు తరాలకు విఘాతం కలిగించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సేంద్రీయ ఎరువులు ఏమాత్రం తగ్గకుండా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. రసాయన ఎరువుల మూలంగా భూమిలో సారం పూర్తిగా కోల్పోయి నిస్సారంగా మారే అవకాశం ఉందని తెలిపారు. భూసారం తగ్గకుండా ఉండాలంటే రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సూచించారు.
పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడుతూ పరిశోధన కేంద్రంలో రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయబడతాయని, రైతులు కేంద్రాన్ని సందర్శించాలని కోరారు. కొన్ని విత్తనాలపై సబ్సిడీ ఉంటుంది. మరికొన్ని విత్తనాలకు సబ్సిడీ ఉండదని తెలిపారు.
అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన తూర్పారబట్టే యంత్రం కొనేందుకు బ్యాంకు రుణం ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో దేవరకద్ర ఏడీఏ రాజేంద్ర అగర్వాల్, ఏవో మురళీధర్, పశువైద్యాధికారి మధుసూదన్, ఏఈవోలు ప్రసాద్ బాబు, మానస, సీతారాం, తస్లీమా బేగం, వివిధ గ్రామాల రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.