మూసాపేట(అడ్డా కుల), మే 05: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నగల్ గ్రామంలో వరి ధాన్యం సేకరణ చేయాలని రైతులు (Farmers) ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్న చోట కాకుండా అనుబంధ గ్రామమైన దుబ్బ పల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల్లో వరి పంట పండించుకొని కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లాలని, ఇక్కడే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా కంపచెట్లు, రాళ్లు వేసి ధర్నా చేపట్టారు. వెంటనే వరి కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.
గతంలో ఎక్కడ వరి ధాన్యం ఉంటే అక్కడే కొనుగోలు చేశారని, ఇప్పుడు రైతులను ఇబ్బందులు పెట్టేందుకే ఇష్టానుసారంగా దూర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. తాసిల్దార్ వెంటనే ఇక్కడికి రావాలని రైతుల పట్టుబట్టారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు రైతులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు. తాసిల్దార్ స్పందిస్తూ గ్రామంలో కూడా వారి కొనుగోలు చేస్తామని, లారీలు వెళ్లే అవకాశం ఉన్న ప్రతి చోట కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.