గద్వాల, జనవరి 30 : వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కుర్వ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోని పల్లీ రైతులతో బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతుతో కలిసి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అధిక సంఖ్యలో రైతులు వేరుశనగ పండిస్తారని, పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే మద్దతు ధర లేకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు, వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించా రు.
వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6,783 ఉండగా మార్కెట్లో మాత్రం తక్కువ ధరకు తీసుకొని రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చినంక పరిస్థితి పూర్తిగా మారిపోయి మార్కెట్ వ్యవస్థ అంతా మళ్లీ దళారుల చేతుల్లో పోయిందని వాపోయారు. మార్కెట్ అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిచో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రైతులకు ఓ వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వక, రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకపోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మోనేష్, శ్రీరాములు, రాజు, ప్రతాప్‌రెడ్డి, దానం, బీచుపల్లి, నర్సింహులు, రాము తదితరులు పాల్గొన్నారు.