అయిజ, జనవరి 31 : అయిజ మండలంలోని బింగిదొడ్డి చెరువులో నీటి నిల్వకు రైతులు చర్యలు చేపట్టారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటిమట్టం పెంచేందుకు మత్స సహకార సంఘంతో కలిసి ముందుకొచ్చా రు. ఓవైపు చేపలు పెంచేందుకు.. మరోవైపు ఆయకట్టు సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం తాటికుంట రిజర్వాయర్ నుంచి బింగిదొడ్డి చెరువుకు నీరొచ్చేందుకు తూము ఉన్నా కాల్వ పూడిక పెరగడంతో పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు, ఇరిగేషన్ అధికారులకు విన్నవించారు.
రిజర్వాయర్ నుంచి కాల్వ తవ్వాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో అధికారుల స్పందన రాలేదు. దీంతో మత్స్య సహకార సంఘంతో కలిసి 15 మంది కర్షకులు స్వచ్ఛందంగా కదిలారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని తాటికుంట రిజర్వాయర్ నుంచి బింగిదొడ్డి చెరువు వరకు నీటిని పారించేందుకు దాదాపు 3 కిలోమీటర్ల డీ-1 కాల్వలో పూడికతీత తొలగింపు పనులు శుక్రవారం చేపట్టారు.
ముళ్ల పొదల తొలగింపు పనులకు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు కావచ్చని, సొంతంగా డబ్బులు విరాళంగా వేసుకొ ని పనులు చేపడుతున్నట్లు రైతులు తెలిపారు. తప్పెట్లమొ ర్సు, దేవబండ, బింగిదొడ్డి చెరువు వరకు కాల్వను శుభ్రపర్చనున్నట్లు రైతులు తెలిపారు. దీంతో నీటి నిల్వలకు ఢోకా ఉండదని, చేపలు పెంచుకోవచ్చని, అలాగే సాగుకు నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.