కల్వకుర్తి, మార్చి 31: మార్చి 31గడువు ముగిసింది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమకాలేదు. జనవరి 26న రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మరోసారి మాట తప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతుభరోసా రోజుకొక మాట మాట్లాడారు. చివరకు రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు కాకుండా రూ.12వేలు ఇస్తామని మాట మార్చారు.
జనవరి 26న రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేస్తామని ప్రకటించారు. చివరకు జనవరి 26 రానే వచ్చింది. ఆ రోజున రైతుభరోసాతోపాటు మరో 3 పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ట్విస్ట్ ఏమిటంటే సదరు పథకాలు కూడా మండలంలో ఒక్క పైలెట్ గ్రామంలో మాత్రమే పూర్తిస్థాయిలో అమలవుతాయని చావు కబు రు చల్లగా చెప్పారు. రైతుభరోసా డబ్బులు మార్చి 31నాటికి పంట సాగుకు యోగ్యమైన ప్రతిఎకరాకు రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయడానికి జనవరి 26 నుంచి మార్చి 31వరకు అంటే దాదాపు 64రోజుల సమయం తీసుకున్నారు. 64 రోజుల్లో 4ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేయలేదు. తమ ఖాతాల్లో రైతుభరోసా పెట్టుబడి సాయం డబ్బు లు పడతాయేమోనని ఎదురుచూసిన రైతులకు నిరాశ తప్పలేదు. వానకాలం రైతు భరోసాకు మంగళంపాడిన రేవంత్ ప్రభుత్వం యాసంగికి కూడా మొండిచెయ్యి చూపిస్తుందనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో 3,22,724 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరి ఆధీనంలో 7,59,793 భూమి సాగువుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగికి రూ.379.90 కోట్లు, వానకాలానికి రూ.379.90 కోట్లు రైతుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమచేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని, రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక పథకం అమలుకు కమిటీలు వేసి కాలయాపనలో వానకాలం పెట్టుబడి సాయానికి మంగళం పాడింది. చివరికు యా సంగి నుంచి రూ.15వేలు కాకుండా రూ. 12వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది యాసంగి కి ఎకరాకు రూ.6వేల చొప్పున జనవరి 26 రైతుల ఖాతాలలో వేస్తామని ప్రకటించారు.
ఆ గడువుకు కూడా దాటిపోయింది. విషయానికి వస్తే జిల్లాలో యాసంగికి రైతులలో ఖాతాలలో రూ.6 చొప్పున రూ.455.87 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 4ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమచేశామని చెబుతున్నా.. 4ఎకరాల వరకు భూమి ఉన్న చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు కాలేదని తెలుస్తుంది.
సాగుచేయని భూములకు..
ప్రభుత్వం సాగుకు యోగ్యంకాని భూములకు రైతుభరోసా ఇవ్వమని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు గుట్టలు, రాళ్లు, వెంచర్లు, ఫౌల్ట్రీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన భూములను గుర్తించి సాగుభూముల జాబితా నుంచి తొలగించింది. ఇంతవరకు భాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం మరో వార్త రైతులను గాబరా పెట్టిస్తున్నది.
రెండేండ్ల నుంచి పంటవేయని పొలాలకు కూడా రైతుభరోసా ఇవ్వడం లేదని, ఇందుకు సంబంధించిన సమాచారం గ్రామాలవారీగా ఏఈవోల నుంచి జాబిజా సేకరించిందనే సమాచారం రైతులకు చేరడంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్త మవుతుంది. పంట వేయకుంటే రైతుభరోసా ఇవ్వరట.. అని రైతులు చర్చించుకుంటున్నారు. ఉదాహరణగా రైతుకు 5ఎకరాల పొలం ఉంటే 5 ఎకరాలను ఒకేసారి సాగు చెయ్యడు. వానకాలం కొంత, యాసంగికి కొంత సాగు చేసుకుంటాడు. నిరంతరంగా సాగుచేస్తే దిగుబడి రాదనే ఉద్దేశంతో రైతులు సదరు పొలాల్లో సంవత్సరానికి ఒక పంటను మాత్రమే సాగు చేస్తారు.
రైతుభరోసా జాప్యంపై రైతుల్లో అసహనం
రైతుభరోసా ఇవ్వడానికి గడువులు, నిబంధనలు విధిస్తుందని రైతు సంఘ నాయకులు మండిపతుతున్నారు. ఇప్పటికే వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టిందని, యాసంగికి ప్రభుత్వం ఎగ్గొట్టేందుకే గడువులు పెడుతూ కాలాయాపన చేస్తుందని మండిపడుతున్నారు. రుణమాఫీ విషయంలో ఇలాగే గడువులు, కాలయాపన చేసి సగం మంది రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని రైతు నాయకులు గుర్తు చేస్తున్నారు. మార్చి 31 నాటికి పూర్తిగా రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభు త్వం ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడడంలేదని ఆందోళన వ్య క్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యాసంగి, వానకాలాని కి రైతు భరోసా ఠంచన్‌గా పడేదని గుర్తు చేసుకుంటున్నారు.
మాట తప్పడం కాంగ్రెస్ నైజం
మాట తప్పడం, హామీల అమలుకు గడువులు పెంచడం కాంగ్రెస్ ప్రభుత్వ సహజ లక్షణం. కాలయాపన చేస్తూ పరస్పర విరుద్ధ ప్రకటనలిస్తూ రుణమాఫీ పథకానికి మంగళం పాడిన సీఎం రేవంత్ ప్రభుత్వం రైతుభరోసాను కూడా రుణమాఫీ బాటలోనే తీసుకెళ్తుంది. ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్నది వాళ్లే.. కాదుకాదు రూ.12 వేలు ఇస్తామన్నది వాళ్లే.. జనవరి 26న ఇస్తామన్నరు. తీరా కాదుకాదు మార్చి 31వరకు పూర్తిగా ఇచ్చేస్తామన్నారు.
ఇప్పుడు ఆ గడువు కూడా అయిపోయింది. రైతులు పెట్టుబడి కోసం అరిగోస పడుతుంటే గడువులు పెడుతూ కాలాయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. వినాయక చవితి, దసరా అనే గడువులు విధించకుండా వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేయాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు.
– బండెల రాంచంద్రారెడ్డి, రైతు జేఏసీ నేత, కల్వకుర్తి