ధరూరు, మే 20 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులకు సాగునీరందంచడానికి జవహర్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు రెండు ప్రధాన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ప్రణాళికతో దీన్ని రూపొందించారు. 21 టీఎంసీల నీటిని వినియోగించే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ధరూరు మండలంలోని ఉప్పే రు వద్ద నీటిని ఎత్తిపోయడంతో మొదలవుతుంది. మొదటి లిఫ్ట్ ద్వారా గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌కు, రెండో లిఫ్ట్ ద్వారా ర్యాలంపాడు ఫేజ్-2 రిజర్వాయర్‌కు నీటిని తరలించి, ప్రణాళికాబద్ధంగా రెండు పంటలకు వినియోగించాలి. మొదటి లిఫ్ట్ నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ సమస్యల వలయంలో చిక్కుకున్నది. నాసిరకమైన పనుల కారణంగా నీటిని నిల్వ ఉంచుకోలేకపోతున్నది. నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్..
కుడి కాల్వల అనుసంధానం ద్వారా 1,11,000 ఎకరాలు, ఎడమ కాల్వల అనుసంధానం ద్వారా 25,000 ఎకరా ల ఆయకట్టు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది. 2012లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2014 నుంచి నీటిని అం దిస్తూ కులవృత్తుల వారు, ప్రాజెక్ట్ నిర్మాణంలో భూ ములు కోల్పోయిన వారు అక్కడి కాల్వల వెంట చేపల ఫ్రై సెంటర్లు పెట్టుకొని జీవనాధారం పొందేవారు. రైతులు కూడా రెండు పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబురంగా సాగు చేసుకునే వారు. 2019లో నీటి బుడగల లీకేజీతో ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రాజెక్ట్‌ను ప్రత్యేక బృందాలు పరిశీలించి నాలుగు టీఎంసీల నిల్వను రెండు టీఎంసీలకు కుదించారు. వర్షాలు కురవడంతో 2023 వరకు రెండు పంటల కు అధికారులు సాగునీరు అందిస్తూ వచ్చారు. ప్ర స్తుతం మాత్రం మొదటి పంట ప్రారంభానికే ప్రభు త్వం చేతులెత్తేసి, రెండో పంట వేయొద్దని హెచ్చరించింది. దీంతో ఆయకట్టు రైతులకు అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని అన్నట్లుగా.. రిజర్వాయర్‌తో రైతులకు మేలు జరుగుతుందనుకుంటే లీకేజీలతో ఇబ్బందులు తలెత్తాయి.
105, 106,107, 108 ప్యాకేజీల కుడి కాల్వ లు 1,11,000 ఎకరాలు, 104 ఎడమ కాల్వ ప్యా కేజీ కింద 25వేల ఎకరాలు, కుడి కాల్వ కింద తాటికుంట రిజర్వాయర్ 1.5 టీఎంసీలు, నాగర్‌దొడ్డి రిజర్వాయర్ 0.6 టీఎంసీలు, ముచ్చోనిపల్లి రిజర్వాయర్ 1.5 టీఎంసీలు, చిన్నోనిపల్లి రిజర్వాయ ర్ 1.5 టీఎంసీల సామర్థ్యంతో ర్యాలంపాడు, సద్దలోనిపల్లి, మల్దకల్, అయిజ, మేడికొండ, గట్టు, ఆ రగిద్ద, చమన్‌ఖాన్‌దొడ్డి, టీటీదొడ్డి, చాగదోణ, భూం పురం, వడ్డేపల్లి, రాజోళి మండలాల రైతులకు 48 కిలోమీటర్ల మెయిన్ కెనాల్స్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నాయి. 104 ప్యాకేజీ 5కింద 5 కిలోమీటర్ల మెయిన్ కెనాల్స్ కేటీదొడ్డి, ధరూరు మండలాలకు సాగునీటిని సరఫరా చేస్తున్నాయి.
ర్యాలంపాడ్ రిజర్వాయర్ ను ఇప్పటి వరకు మూడు కమిటీలు పరిశీలించి పలు సూచన లు చేశాయి. డిపార్ట్మెంట్ ఆ ఫ్ ఇరిగేషన్, ఈఎన్సీ, ఎక్స్పర్ట్ కమిటీలు పరిశీలించాయి. ప్రస్తుతం జియోమంబ్రె పాలిథిన్ ఉపయోగించొద్దని సూచనలు చేశారు. మొత్తం మరమ్మతులు చేయాలా? ఉన్న దాంట్లో కొన్నింటిని సరిచేస్తే సరిపోతుందా అని బృందాలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం మరమ్మతులకు రూ.157కోట్ల వరకు ఖర్చు అవుతుందని నివేదిక పంపగా ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నది. సమగ్రంగా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటాం.
కేసీఆర్ హయాం లో ఎమ్మెల్యే చొరవతో ర్యాలంపాడ్ రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు సరిపడా సా గునీరు అందించాం. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయకపోతే రైతులకు సాగునీటి క ష్టాలు తప్పవు. ర్యాలంపాడులో నీళ్లు ఉంటేనే గ్రామాలకు సాగునీరు సరఫరా అవుతుంది. సబ్ రిజర్వాయర్లు లేనందున ఇక్కడి నుంచి వదిలిన కాల్వలే ప్రత్యక్ష ఆధారం. ర్యాలంపాడులో స్టోరేజీ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇకనైనా కష్టాలు గుర్తించి పరిష్కారం చూపాలి.