మల్దకల్, జూలై 2 : మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు విరివిగా పొగాకు పంటను సాగు చేశారని, పొగాకు కంపెనీ పంటను కొనుగోలు చేసేందుకు ముందు రాకపోతే కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్నాయుడు అన్నారు. బుధవారం వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆళ్లగడ్డ కంపెనీ దగ్గరకు వెళ్లగా వారు రైతులను లోనికి రానివ్వలేదు. దీనిపై స్పందించిన ఆయన మండలంలో సద్దలోనిపల్లి, అమరవాయి, నీలిపల్లి, గార్లపాడు తదితర గ్రామాల్లో రైతులు యాసంగిలో పొగాకు పంటను పెద్ద ఎత్తున సాగు చేశారన్నారు.
అయితే మూడు నెలలు అయినా సరే పంటను కొనకపోడవం వల్ల రైతులు పొగాకు బేళ్లను తమ ఇండ్ల దగ్గరే ఉంచుకున్నారు. ఎట్టకేళకు పండించిన పొగాకు పంటను తీసుకురావాలని ఏపీలోని ఆళ్లగడ్డకు కంపెనీకి తీసుకురావాలని రైతులకు గేటు పాసులు అందజేశారు. దీంతో రైతులు ఎంతో సంతోషంతో మంగళవారం రాత్రి బయలుదేరి ఆళ్లగడ్డకు బుధవారం ఉదయం వాహనాలపై తమ పంటను తరలించారు.
అయితే కంపెనీ ముందుకు వెళ్లగా గేటు పాసులు చూయించినా అక్కడి సిబ్బంది కంపెనీ లోపలకు రానివ్వకుండా రైతులను అడ్డుకున్నారు. అలాగే గేటు పాసులు ఇచ్చిన కంపెనీ ప్రతినిధికి ఫోన్ చేసినా స్విచ్ఛాప్ వస్తుందని అక్కడి నుంచి రైతులు వాపోతున్నారన్నారు. కంపెనీ వెంటనే రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి వారి న్యాయం చేయాలని లేదంటే కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.