మక్తల్ : నారాయణపేట- కొడంగల్ ( Narayanpet-Kodangal ) ఎత్తిపోతల పథకం( Lift Irrigation) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ( Farmers Meeting) ఉందని చెప్పిన అధికారులే డుమ్మా కొట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సచిన్ గంగ్వార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థానిక పంచాయతీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ తీసుకునేందుకు గురువారం మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామానికి రానున్నారని రెవెన్యూ అధికారులు రైతులకు సమాచారం అందజేశారు.
దీంతో రైతులంతా తమ పనులు మానుకొని పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. గంటల తరబడి పంచాయతీ కార్యాలయం ఎదుట వేచి చూసినా అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కాట్రేపల్లి శివారులో మిగిలి ఉన్న 90 ఎకరాల భూమి సైతం ప్రభుత్వం రైతుల నుంచి సేకరణకు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా అధికారులు రైతులతో సమావేశం అయ్యేందుకు వస్తున్నామని చెప్పి పత్తా లేకుండా పోయారని రైతులు వాపోయారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారంగా నష్టపరిహారం చెల్లించి, భూముల కోల్పోయే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇళ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదనపు కలెక్టర్ సమావేశానికి రాకపోవడం పట్ల మక్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్ను నమస్తే తెలంగాణ ప్రతినిధి వివరణ అనివార్య కారణాలవల్ల సమావేశానికి అదనపు కలెక్టర్ రాలేకపోయారని తెలిపారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల స్థితిగతులపై సర్వే చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. త్వరలోనే సర్వే పనులను చేపట్టి రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు.