ఏం కొనేలా లేదు.. ఏం తినేలా లేదు.. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యులపై భారం పడుతున్నది. రూ.400 కేజీ ధరలో బీన్స్ బెంబేలెత్తిస్తుండగా.. రూ.250 ధరతో చిక్కుడు చుక్కలనంటుతుండగా.. మిర్చి ఘాటుకు తోడు క్యారెట్, కాకర కేక పెట్టిస్తున్నది. ధరలను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇంత ధరకు మార్కెట్లో వెజిటేబుల్స్ లభ్యమవుతున్నా రైతులకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు. ధరలు పెరగడంతో కూరగాయల జోలికి వెళ్లకుండా ఉన్నదాంట్లోనే సర్దుకుంటున్నట్లు మహిళలు పేర్కొంటున్నారు.
గద్వాల, జూన్ 9 : జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉండగా మరో వైపు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రజలకు కూరగాయల ఘాటు తగలడంతో సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మండి పోతున్న ధరలతో ప్రజలు కూరగాయలు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బీన్స్ ధర కేజీ రూ.400ఉండగా చిక్కుడు రూ.250 కిలోగా ఉంది. బెండకాయ, ఆలు, వంకాయ, బీట్రూట్ లాంటి రెగ్యులర్‌గా వినియోగించే కూరగాయల ధరలు సగటున రూ.60 దొరుకుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఇవే కూరగాయాలు రూ.40లకు ఇవి లభ్యమయ్యేవి. టమాట గతనెలలో రూ.10నుంచి రూ. 20కిలో లభించగా ప్రస్తుతం మార్కెట్లో రూ. 60కి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కురువకపోవడంతో పంటలు అనుకున్న స్థా యిలో దిగుబడి రాకపోవడంతో ధరలు మండిపోతున్నాయి. మన ప్రాంతంలో కూరగాయలు సాగు అంతంత మాత్రమే ఉండడం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో ధరలు ఒక్కసారిగా అ మాంతగా పెరిగిపోయాయి. కడప, చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం అక్కడ నుంచి మనకు వచ్చే కూరగాయలు రాకపోవడంతో మార్కెట్లో కూరగాయలకు కొరత ఏర్పడడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా సరాసరి కేజీ రూ.60పైనే ఉండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ మేరకు దృష్టి సారించక పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఉద్యానవ శాఖ అధికారులు రైతులకు కూరగాయలు సాగుపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఇతర పంటలు వేయడంతో మన ప్రాంతంలో కూరగాయలు సాగు అంతంత మాత్రమే ఉంది. గత నెలల్లో వంకాయ, కాలిఫ్లవర్, క్యాప్సికం, బీరకాయ, క్యారెట్ తదితర కూరగాయలు రూ.40కు కేజీ ఉండగా ప్రస్తుతం అవి కేజీ రూ.80గా విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్న పంట పండించిన రైతులకు మాత్రం ఆ దిశగా ధరలు లేకపోవడంతో మార్కెట్లో రైతులు పండించిన కూరగాయలు దళారులకు ధర వచ్చిన కాడికి అమ్ముకొని పోతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో సామాన్యుడు ఏదీ కొని తినలేని పరిస్థితి నెలకొన్నది. వచ్చిన జీతంలో కూరగాయలకు పావలా వంతు వెచ్చించాల్సి వస్తుందని కూలీలు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచి అందరికీ అందుబాటులో కూరగాయల ధరలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటి గ్రేటెడ్ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తే అందులో రైతులు నేరుగా కూరగాయలు విక్రయించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో అటు రైతులు ఇటు కొనుగోలు దారులకు లాభం చేకూరడంతోపాటు కూరగాయల ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు. ఆదిశగా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
వర్షాలు సరిగా కురువకపోవడంతో కూరగాయల సాగు దెబ్బతిందని చూ పించి రైతుల నుంచి వ్యాపారులు, దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారుల ముక్కు పిండి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్లో అమ్ముకోలేక వచ్చిన కాడికి దళారులకు అమ్ముకొని పోతున్నారు. దీంతో రైతులు నష్టపోతుండగా వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో మార్కెట్లో అన్ని ధరలు పెరిగిపోయాయి. కూరగాయలు కొనుగోలు చేద్దామంటే వాటి ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుత పరిస్థితిలో పేద, సామాన్య ప్రజలు అటు మార్కెట్లో సరుకులు ఇటు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొన్నది. రూ.100 తీసుకొని మార్కెట్ వెళ్తే ప్రస్తుతం రెండు కేజీల కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. ధరలపై అధికారులు నియంత్రణ ఉండేలా చూడడంతోపాటు రైతులు కూరగాయల సాగుచేసే విధంగా వారిని ప్రోత్సహించాలి. కూరగాయల సాగుతో లాభాలు ఉంటాయని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఓ వైపు పప్పు, ఆయిల్, ఆకుకూరలు ధరలు పెరిగిపోయాయి. గత వారం రోజులుగా కూరగాయల ధరలు అన్ని రూ.60 పైనే ఉన్నాయి.గతంలో రూ.100 కూరగాయలు తీసుకుంటే ఐదారు రోజులు వచ్చేవి. ప్రస్తుతం రూ.100 పెడితే రెండు రోజులకు సరిపడా కూరగాయలు రావడం లేదు. కూరగాయలు కొనాలంటేనే భయం వేస్తుంది. ప్రస్తుతం ఏమి కొని తినే పరిస్థితుల్లో లేము. పేద, మధ్య తరగతి వారు కూరగాయల జోలికే వెళ్లడం లేదు. ఇంట్లో ఉన్నదానితో సర్ధుకుంటున్నాం.. ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి.