కల్వకుర్తి, ఫిబ్రవరి 12 : పాలమూరుకు మేలు చేస్తా రా.. అన్యాయం చేస్తారా..? అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకొని ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చే శారు. కల్వకుర్తి నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలతో సోమవారం సీకేఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎ మ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టి శరవేగంగా పనులు పూర్తి చేసిందన్నారు. పాలమూరు బిడ్డలకు మళ్లీ జీవన్మరణ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. కృష్ణాజలాలపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ధారాదత్తం చేశారని, దీన్ని ఆధారాలతో బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయడంతో కాంగ్రెస్ బుద్ధిమంతులు తిరిగి తమపైనే ఎదురుదాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ హక్కులను హరించే విధం గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలత్వాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ బిడ్డలకు తెలియజెబుతూ వారిలో చైతన్యం నింపుదామన్నారు. కేఆర్ఎంబీపై బీఆర్ఎస్ శ్రేణుల్లో చైతన్యం నింపేందుకు మంగళవారం న ల్లగొండలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు.
కృష్ణానదీ జలాలలో తెలంగాణ వాటాపై కేసీఆర్ ఎప్పుడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ సంతకం చేసిందన్నారు. ఎన్నికలకు రెండేండ్ల ముందుగానే తెలంగాణ వ్యతిరేక మీడియా సహకారంతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కార్‌పై విషం చిమ్మే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ప్రతి చిన్న అంశాన్ని బూతద్ధంలో చూపుతూ తెలంగాణ ప్రజల హృదయాల్లో వి షం నింపారని దుయ్యబట్టారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏజెన్సీలు మెచ్చుకుంటూ రివార్డులు ఇచ్చిన విషయాలను గుర్తు చేశారు. ఇంత మంచి జరుగుతున్నా.. తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర మీడియా, అధికారం కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ బిడ్డల మనసులను విషతుల్యం చేశారని చెప్పారు. కొంతమంది కుహన మేధావులు అదే పనిగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని.. ఇప్పుడు సదరు మే ధావులు రైతుబంధు, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కొత్తొక విం త పాతొక రోత అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అది చే స్తాం.. ఇది చేస్తామంటూ ఎన్నో హామీలను ఇచ్చిందని, ప్రజలు వాటిని నమ్మడంలో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశా రు. ప్రతి సమాజంలో పరివర్తన ఉంటుందని, అందు లో భాగంగా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందన్నా రు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వ్యత్యాసం ఓట్లు కేవలం 1.85 శాతం మాత్రమేనని అన్నారు. మళ్లీ పుంజుకొని అధికారం సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ విద్రోహ పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఆరిపోయే దీపంలా ఉందని ఎద్దేవా చేశారు. రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఆశలు సన్నగిల్లాయని చెప్పారు. వేరుశనగ రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమబాట పడుతున్నారని, కల్వకుర్తి, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులు చేస్తున్న ఆందోళనను వివరించారు. కాంగ్రె స్ పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపుదామని, ప్రజల పక్షాన అనునిత్యం పోరాటాలకు సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేలా, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిద్దామని చెప్పారు. ప్రజల కష్టాలు, సంతోషంలో పాలుపంచుకుందామ న్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలయ్యేలా పోరాటాలకు సిద్ధంగా ఉందామని సూచించారు. గతంలో జరిగిన విషయాలను మరిచిపోదామని, ఇక నుంచి అం దరం కలిసికట్టుగా ఉందామని, తాను కూడా కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇ చ్చారు. అంతకు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సర్పంచులు, ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ షాహెద్, ఎంపీపీ మనోహర, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, విజయ్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పత్యానాయక్, అర్జున్‌రావు, పుట్ట రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.