మక్తల్ : ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి,పర్యావరణాన్ని ( Environment ) కాపాడాల్సిన ( Protect ) బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో రమేష్ కుమార్( MPDO Ramesh Kumar) అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మక్తల్ మండలం జక్లేర్ తోపాటు అన్ని గ్రామాలలో పర్యావరణ పరిరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సదస్సులను నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణం దినోత్సవం-సందర్భంగా ప్రతి ఒక్కరూ భూమి రక్షణకు, ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు సిద్ధం కావాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు 1972 సంవత్సరంలో స్టాక్‌హోం నగరంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల 1973 నుంచి ప్లాస్టిక్ నివారణ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామని వివరించారు.
భవిష్యత్ కోసం నేడు మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, సంస్కృతి, పచ్చదనం పట్ల మమకారం, భూమి పట్ల బాధ్యత ఉన్నప్పుడే భవిష్యత్తు తరాలకు జీవన అవకాశం కల్పించ వచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.