మహబూబ్‌నగర్, అక్టోబర్ 18 : జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన వార్డులు, ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ జనరల్ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య నిర్వహణపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత మళ్లీ దవాఖానను తనిఖీ చేస్తానని, అపరిశుభ్రంగా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆనంతరం ఐసీయూను సందర్శించారు. వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయని, ఇంకా కావాల్సి ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. హరేరామ హరే కృష్ణ ద్వారా అందిస్తున్న రూ.5ల భోజనం గురించి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో వ్యాధి నిర్ధారణ చేసే సీమెన్ యంత్రం ని ర్వహణలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్ట్రెచర్లు, వీల్‌చైర్ ఇతరత్రా వసతులు కావాలంటే ప్రతిపాదనలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ద వాఖాన సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు ఉన్నారు.