అచ్చంపేట, జనవరి 20 : అచ్చంపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కావాల్సిన వసతులు, సిబ్బందిని నియమిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి అచ్చంపేటలోని వందపడకల ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. ఏరియా దవాఖానలో ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ, డయాలసిస్ వార్డులను పరిశీలించారు. ఐసీయూ, వెల్టూర్లో పీహెచ్సీ ఏర్పాటు, సిబ్బంది తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అచ్చంపేటలో నర్సింగ్ కాలేజీ మంజూరు అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దృష్టిసారించామన్నారు. అచ్చంపేటలో పరిశ్రమ ఏర్పాటు కో సం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అ నంతరం పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరై రూ.143లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్తీదవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అచ్చంపేట అంబేద్కర్ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. రంగాపూర్ నిరంజన్‌షావలీ దర్గాలో మంత్రి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, సూపరింటెండెంట్ ప్రభు, మున్సిపన్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.