ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో దుందుభీ నది పరవళ్లు తొక్కుతున్నది. చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు అలుగుపారుతున్నాయి. తాడూరు మండలంలోని వాగులో ఆటో కొట్టుకుపోయింది. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం 12గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 23,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 25,710 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం డ్యాంలో ప్రస్తుతం 188టీఎంసీ నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జడ్చర్ల/అయిజ/అమరచింత/ శ్రీశైలం, జూలై 27 : గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జడ్చర్ల నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. జడ్చర్ల మండలంలో దుందుభీ వాగు బుధవారం తెల్లవారుజామున నుంచి నిండుగా పారుతున్నది. దీంతో వాగుపై ఉన్న లింగంపేట, నెక్కొండ, కుర్వగడ్డపల్లి, గుట్టకాడిపల్లి వద్ద చెక్‌డ్యాంలు నిండుకుండలా మారాయి. కోడ్గల్ గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు పెరిగి బోర్లు రీచార్జి అవుతాయని సంబురపడుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు వాగు, చెక్‌డ్యాంలు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాగు పరీవాహక గ్రామాల ప్రజలకు పోలీసులు సూచనలిస్తున్నారు.
టీబీ డ్యాంలో 12 గేట్ల ఎత్తివేత
44,255 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
104.664 టీఎంసీల నీటి నిల్వ
జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు నిలకడగా వరద
అయిజ, జూలై 27 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. వచ్చిన వరదను వచ్చినట్లే 12 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. బుధవారం డ్యాంలో 44,255 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 44,255 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 104.664 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ఎ స్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 34,633 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 34,100 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 533 క్యూసెక్కులు వదిలినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.4 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
జూరాలకు నిలకడగా..
అమరచింత, జూలై 27 : జూరాల ప్రాజెక్టులో బుధవారం రాత్రి 23,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తికి 22,775, ఎడమ కాలువకు 920, సమాంతర కాలువకు 150, కుడి కాలువకు 370 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు నుంచి 25,710 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలానికి..
శ్రీశైలం, జూలై 27 : శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పం గా వస్తున్నది. బుధవారం ఉదయం జూరాల విద్యుదుత్పత్తి నుంచి 22,710, సుంకేసుల నుంచి 24,816 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అదే విధంగా ఏపీ పవర్‌హౌస్‌లో 31,809, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కులతో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేశారు. జ లాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్ర స్తుతం 880 అడుగుల్లో 188.136 టీఎంసీలు నిల్వ ఉన్నది.
దుందుభీ వాగులో ఇరుక్కున్న ఆటో
తాడూరు, జూలై 27 : మండలంలోని సిర్సవాడ గ్రామం లో మాదారం గ్రామానికి వెళ్లే దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, మాదారం గ్రామానికి చెందిన శ్రీశైలం, నిరంజన్ సిర్సవాడకు ఆటోలో వస్తుండగా వాగులో ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.