తిమ్మాజిపేట : ఒకప్పుడు సినిమా రంగానికి దీటుగా నాటక రంగం ( Drama plays ) ప్రజలలో చైతన్యాన్ని, ఆహ్లాదాన్ని, సందేశాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలంగాణ నాటక రంగ మాజీ చైర్మన్ బాద్మీ శివకుమార్ ( Badmi Sivakumar) , నాగర్ కర్నూల్ జిల్లా నాటక సమాజాల సమైక్య అధ్యక్షులు ఆర్ సత్యం అన్నారు.
తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామంలో శ్రీబ్రహ్మానంద చారి కళా నాట్య మండలి భూత్పూర్, వెంకటేశ్వర కళానాట్యమండలి గొరిట, గాజేశ్వర నాటక కళా మండలి గాజులపేట వారు సంయుక్తంగా నిర్వహించిన నాటక ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
పౌరాణిక నాటకాలు పురాణ ఇతి హాసాలకు సంబంధించినవి కావడం వలన ప్రాచ్యాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న యువత కారణంగా గత కొంతకాలంగా నిరాదరణకు గురి అయ్యిందని తెలిపారు. అనేక వ్యయప్రాయాసాల కోర్చి ప్రదర్శించినా ప్రేక్షకుల ఆదరణ కరువైందని పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్రామస్థాయిలో యువత నటనపై, నాటక రంగంపై మక్కువ చూపడంతో సత్యహరిచంద్ర, శ్రీకృష్ణరాయబారం, రామాంజనేయ యుద్ధం, చింతామణి వంటి సందేశాత్మకమైన నాటకాలను జన రంజకంగా ప్రదర్శిస్తున్నారు. ఇది పౌరాణిక నాటక రంగానికి శుభ పరిణామమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు చక్రధర్, సీనియర్ కళాకారులు డి.రాములు, జిల్లా నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్, మాజీ ఎంపీటీసీ కె భాగ్యమ్మ, మాజీ సర్పంచ్ కె మురళీధర్ రెడ్డి, గ్రామ కళాకారులు నర్వ శంకర్రావు, కె.రాఘవాచారి, సి రాములు, రామకృష్ణ రెడ్డి, సాయిలు, మురళీధర్ గౌడ్, ఎస్ తిరుపతయ్య మాస్టర్ ,కళాకారులు పాల్గొన్నారు.