కోడేరు, ఆగస్టు 13 : కోడేరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గత మే నెలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆగ్రామ సర్పంచ్ ఖాజాబేగం వార్డు సభ్యులు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిచో న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. సర్పంచ్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కోడేరులో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాయపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత మే 13వ తేదీన సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఇతర గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభించారని అందుకు వారిపై అక్రమంగా కేసులు నమోదు చేసి మూడు నెలల తరువాత కేసులు నమోదయ్యాయని పోలీస్ స్ట్టేషన్కు రావాలని ఎస్సై ఆదేశాలు జారీ చేయడం అప్రజాస్వామికం అన్నారు. సర్పంచ్ ప్రజా ధనాన్ని కూలగొట్టి ప్రభుత్వ ఆస్తులను దోచుకోలేదని రైతులకు ఉపయోగపడే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే పోలీసులకు కేసులు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
మండలంలో బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఇతర నాయకులు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని భవిష్యత్‌లో అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో అణచివేయడం సరికాదని రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకుండా వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తమ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఐకేపీ అధికారులు తనును ఆహ్వానించారని వారి సూచన మేరకు తనతోపాటు కొంత మంది వార్డు సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలతో కలిసి అక్కడి వెళ్లానని ఉదయం 7గంటలకు ప్రారంభం ఉండగా 10 గంటలైనా కేంద్రం ప్రారంభించలేదని నాకు నా కుమారుని వివాహం ఉన్నందున ముందుగా కొబ్బరికాయ కొట్టి వెళ్లానని అందుకు తనతోపాటు మరో 11మందిపై అక్రమంగా కేసులు పెట్టారని కంట తడి పెట్టింది.
మహిళా సర్పంచునైన తనకు ఇంత అవమానం జరగడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎవరిపైనా తనకు ఎలాంటి కోపం ద్వేషం లేదని కానీ కొంత మంది రాజకీయ కక్షలతో మాపై కేసులు పెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్, వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.