వనపర్తి, జూలై 5 : సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులపై చిన్నచూపు చూస్తున్నారని వికలాంగుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ ప్రభాకర్‌శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పలు పార్టీల మద్దతుతో దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు కావొస్తున్నా హామీలను నెరవేర్చకుండా దివ్యాంగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం.. అన్ని ప్రభు త్వ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్, రాష్ట్ర బడ్జెట్లో 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. 6వ తేదీ నుంచి 16 వరకు అన్ని కలెక్టరేట్ల వద్ద దీక్షలు చేపడుతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 17 నుంచి అన్ని మండలాల్లో దీక్షలు, ధర్నాలు చేస్తామని, అవసరమైతే రోడ్డు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించా రు. ధర్నాలో నాయకులు గట్టుస్వామి మాదిగ, కృష్ణ య్య, గంధం లక్ష్మయ్య, నారాయణరావు, కుషకుమార్, పోతుపల్లి రాజు, జనార్దన్, విజయ్, కృష్ణవేణి, శ్రీనివాసులు, చెన్నయ్య, రవివర్మ, కృష్ణతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు.
పెంచిన పింఛన్‌ను అమలు చేయాలి
పెంచిన పింఛన్‌ను వెంటనే అమలు చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు శుక్రవారం మహాధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్‌ను పెంచి రూ.6వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను విస్మరించిందని విమర్శించారు. ఆసరా పింఛన్‌కు ఆదాయ పరిమితిని విధించే జీవో 13ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు.