కోడేరు, జూలై 19 : ఎంజీకేఎల్‌ఐలో భాగంగా నిర్మితమైన జొన్నలబొగుడ రిజర్వాయర్ ప్రధాన కాల్వ లైనింగ్ సీసీ దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్నల బొగుడ రిజర్వాయర్ ప్రధాన తూం నుంచి గుడిపల్లి రిజర్వాయర్‌కు వెళ్లే ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ పనుల కోసం 2017-18 ఏడాదిలో ప్రభుత్వం రూ.7.50 కోట్లు నిధులను కేటాయించింది. ఈ నిధులతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లైనింగ్ పనులను నాణ్యత లేకుండా చేయడంతో ఆరేళ్లకే కాల్వ రెండు వైపులా ఉన్న సీసీ దెబ్బతిని కట్ట తెగిపోయే ప్రమా దం ఉందని రైతులు కలత చెందుతున్నారు.
అప్ప ట్లో మెయిన్ కెనాల్‌కు కిలోమీటర్ వరకు నాణ్యత లేకుండా సీసీ వేసి కాంట్రాక్టర్ వదిలేశారు. దీంతో కాల్వ వెంట సుమారు ఆరు చోట్ల సీసీ లైనింగ్ పగుళ్లు ఏర్పడి దెబ్బతిన్నది. ఈవానకాలంలో రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీటిని వదిలితే లైనింగ్ సీసీ పగుళ్లు ఏర్పడి దెబ్బతిన్న ప్రదేశాల్లో కాల్వ తెగిపోయే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. లైనిం గ్ సీసీ దెబ్బతిని సుమారు ఆరేళ్లు కావస్తున్నా సం బంధిత శాఖ అధికారులు మరమ్మతులు చేయటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. మిగిలిన ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్ వేయకుండా ఆరేళ్లుగా కాలయాపన చేస్తున్నా సం బంధిత కాంట్రాక్టర్‌పై సాగునీటి శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవ డం లేదని రైతాంగం ఆరోపిస్తున్నది.
ప్రధాన కాల్వతోపాటు పసుపుల పాన్‌గల్ బ్రాంచి కాల్వకు కూడా సీసీ లైనింగ్ పనులు చేయాలని గత కొన్నేళ్లుగా రైతులు అధికారులను ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. బ్రాంచి కాల్వకు సీసీ లైనింగ్ వేయనందున కాల్వలో జమ్ముగడ్డి విపరీతంగా పెరిగింది. దీంతో చివరి ఆయకట్టు పొలాల రైతులకు నీళ్లు వెళ్లడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అదికారులు చొరవ తీసుకొని దెబ్బతిన్న లైనింగ్ పనులకు మరమ్మతులు చేసి బ్రాంచి కాల్వకు సీసీ లైనింగ్ పనులు చేపట్టాలని రైతాంగం కోరుతున్నది.
ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వ మూడో కిలోమీటర్ నుంచి వెళ్లే పసుపుల పాన్‌గల్ బ్రాంచి కాల్వ కోడేరు మండలంలో చివరి ఆయకట్టు వరకు సీసీ లైనింగ్ వేసేందుకు రూ.40 కోట్ల నిధుల కోసం ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రధాన కాల్వ కు లైనింగ్ సీసీ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు ఇంకా బిల్లులు కొంత వరకు చెల్లించలేదు. ప్రభు త్వం నుంచి బిల్లులు చెల్లించిన వెంటనే మరమ్మతులు చేయిస్తాం. బ్రాంచి కాల్వకు నిధుల మంజూరైన వెంటనే లైనింగ్ సీసీ పనులు మొదలు పెట్టిస్తాం.
-రవీందర్, ఈఈ ఎంజీకేఎల్ఐ