గద్వాల, సెప్టెంబర్ 24 : జూరాల హైలెవల్ రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణం చిచ్చు రేపుతున్నది. ధరూర్ మండలంలోని ఏడు గ్రామాల ప్రజలు రేవులపల్లి-నందిమళ్ల వెళ్లే దారిలో నిర్మించాలని పీజేపీపై ధర్నా చేపట్టారు. అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే గద్వాల మండల ప్రజలు మాత్రం కొత్తపల్లి-జూరాల-ఆత్మకూర్ మధ్య నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గద్వాలలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ధర్నాకొనసాగించారు.
కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సైతం విన్నవించారు. ఇలా వారధి ఏర్పాటు విషయంలో రెండు మండలాల మధ్య వివాదం నడుస్తున్నది. పోటాపోటీగా తమ మండలంలోనే నిర్మించాలని.. కాదు.. మా మండలంలోనే చేపట్టాలని ఒకరికి మించి మరో మండలం వాసులు ఆందోళనలు చేస్తుంటే అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ప్రస్తుతం ఉన్న జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై భారీ వాహనాలు వెళ్లడం వల్ల ప్రాజెక్టు ముప్పు పొంచి ఉండడం, వరదల సమయంలో గేట్లుఎత్తి దించే విషయంలో ప్రాజెక్టుపై ట్రాఫిక్ జామ్ కావడంతోపాటు, భవిష్యత్‌లో బ్రిడ్జికి ఎటువంటి ప్రమాదం లేకుండా దిగువన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చాలాకాలం నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో ఎవరు దానిపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. 28 జూన్ 2025న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు సందర్శనలో భాగంగా గద్వాల జిల్లా రేవులపల్లి నుంచి వనపర్తి జిల్లా నందిమళ్ల గ్రామాల మధ్య హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
1 జూలై 2025 రోజు జీవో నెం -4869/పీఆర్వోజే-11ఏ1/2020న రూ.121.92కోట్లుతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు జీవో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం అనివార్య కారణాల వల్ల అధికారులు జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి- వనపర్తి జిల్లా జూరాల గ్రామాల వద్ద బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయంచడంతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చింతరేవుల, నర్సన్‌దొడ్డి, ఎములోనిపల్లి, పెద్దపాడు, వామనపల్లే, ఉప్పేర్ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు.
పై గ్రామాల ప్రజల వాదన.. ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు పోగొట్టుకున్నామని, ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయామని, ప్రాజెక్టు దగ్గర ప్రభుత్వ భూమి సుమారు 100 ఎకరాలు ఉందని రాకపోకలు ఎటువంటి ఇబ్బంది లేదని వారి వాదన. దీంతో పాటు కొత్తపల్లి-జూరాల గ్రామల దగ్గర బ్రిడ్జి నిర్మిస్తే 20 కిలో మీటర్లు దూరం అవుతుందని రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు వాదిస్తున్నారు. అక్కడ బ్రిడ్జి నిర్మాణ నిలుపుదల చేసి రేవులపల్లి-నందిమళ్ల దగ్గర హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని వారు కోరుతున్నారు.
రేవులపల్లి-నందిమళ్ల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కొత్తపల్లి గ్రామస్తులు రేవులపల్లి -నందిమళ్ల గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేస్తే తమకు దూరం అవుతుందని, వారికి ఇప్పటికే జూరాల ప్రాజెక్టు దగ్గర బ్రిడ్జి ఉన్నందున అక్కడ మరో బ్రిడ్జి అవసరం లేదని కొత్తపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అంటున్నారు. 1964 ప్రాంతంలో ఎన్‌హెచ్-7 హైవే జూరాల-కొత్తపల్లి మీదుగా బ్రిడ్జి ప్రపోజ్ చేశారన్నారు. అయితే దీనిని కొంత మంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం డీపీఆర్ మార్చారన్నారు.
1975లో జూరాల డ్యాం కొత్తపల్లి -జూరాల గ్రామల మధ్య బ్రిడ్జి ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొత్తపల్లి దగ్గర భూమి పూజ కూడా చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గద్వాల -జూరాల-ఆత్మకూర్ మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల హైదరాబాద్ చేరుటకు 24కిలో మీటర్ల దూరం తగ్గుతుందని గ్రామస్తులు అంటున్నారు. రేవులపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేస్తే 52 కిలో మీటర్ల దూరం అవుతుందని ఇది అందరికీ ఇబ్బందిగా ఉంటుందని వారి వాదన. కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మిస్తే గద్వాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆయా గ్రామల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జూరాల హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వం కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి సర్వే చేయడంతోపాటు అందుకు అవసరమైన నిధులకు సంబంధించి జీవో విడుదల చేసింది. అయితే కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం వద్దని రేవులపల్లి-నందిమళ్ల దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్, ప్రస్తుత గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సరిత గత శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. దీనిని ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతున్నారు.
గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెందడం సరితకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరిగితే జిల్లా కేంద్రం అభివృద్ధ్ది చెందుతుందని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. సరితది అలంపూర్ నియోజకవర్గం కాబట్టి గద్వాల అభివృద్ధి చెందడం ఆమెకు ఇష్టం లేదని వారు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఆలోచించి అందరికీ అనువైన ఆమోదయోగ్యమైన ప్రజలకు, ప్రయాణికులకు దూరం తగ్గే చోట బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.