పెద్దమందడి : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ( Paddy Procurement Centre ) కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపించాలని వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథం ( DSO Kasiviswanath) సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. పెద్దమందడి మండలంలోని మనిగిళ్ళ, దొడగుంటపల్లి గ్రామాలలో ఆదివారం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
దొడగుంటపల్లి గ్రామంలో ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా ధాన్యం నిలువ ఉండడంతో త్వరగా తూకాలు చేసి పంపించాలని నిర్వాహకులకు సూచించారు. తూకాలు వేసిన బస్తాలే ఐదువేల బస్తాలు ఉన్నాయని ఐకేపీ నిర్వాహకులు, రైతులు పేర్కొన్నారు.
స్పందించిన డీఎస్వో లారీ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి దొడగుంటపల్లికి ఐదు లారీలు పంపించాలని ఆదేశించారు. దీంతో ఆదివారం సాయంత్రం వచ్చిన ఆరు లారీలల్లో ధాన్యం లోడ్ చేసి పంపించామని బుక్ కీపర్ రాధా తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్వో కాశీ విశ్వనాథం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని పరిశీలించారు.