మక్తల్ : రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు ( Pensioners ) రావలసిన ఐదు డీఏలను వెంటనే చెల్లించాలని నారాయణపేట జిల్లా పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మనోహర్ గౌడ్ ( Manohar Goud ) డిమాండ్ చేశారు. పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మక్తల్ మండల పెన్షనర్ సంఘం అధ్యక్షులు గోపాల్ అధ్యక్షతన సోమవారం మక్తల్ కన్యకా పరమేశ్వరి దేవాలయ కళ్యాణమండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారం కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు, పెన్షనర్లకు అన్ని బెనిఫిట్స్ వెంటనే ప్రభుత్వం చెల్లించి , ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా సీవీపీ రికవరీ 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు సూర్య ప్రకాష్, సిద్ధి లింగయ్య, సంజన్న, చందూలాల్, శ్రీనివాస్ రెడ్డి, నాగప్ప, అరుణ, సుజాత, విద్యావతి, అనిత, నరసమ్మ, బ్రహ్మానందం, రఘునాథ్ రెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.