మక్తల్, మార్చి 10 : అప్పుడే పుట్టిన బిడ్డకు కదలికలు లేకపోవడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం రాయికోడు గ్రామానికి చెందిన అఖిల సోమవారం అర్ధరాత్రి ప్రసవం కోసం నర్వ పీహెచ్సీకి వచ్చింది. వైద్య సిబ్బంది వెంటనే చికిత్సలు ప్రారంభించడంతో తెల్లవారు జామున 5:26 నిమిషాలకు నార్మల్ డెలివరీ అయ్యి మగబిడ్డ జన్మనిచ్చింది.
అయితే బిడ్డలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆక్సిజన్ అందించినా ఎలాంటి చలనం లేకపోగా సీపీఆర్ నిర్వహించారు. వెంటనే కదలికలు రావడంతో 108లో పసిబిడ్డకు మెరుగైన వైద్యం అందించడం కోసం మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. 108 సిబ్బంది, నర్వ వైద్య సిబ్బంది వాహనంలో వైద్య సేవలు అందించడంతో బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్ మమతతోపాటు దవాఖాన సూపరింటెండెంట్ వైద్య సిబ్బంది, 108 సిబ్బందిని అభినందించారు.