జోగులాంబ గద్వాల : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం ( CPM ) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ( Venkat Swamy ) డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2024 నుంచి తగ్గాయని, ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్‌పై రూ. 50లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ, సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు . పెరిగే గ్యాస్ ధరల ప్రభావం మిగతా నిత్యవసర వస్తు ధరలపై కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి,కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే ప్రజలకు ఉపాధి లేక ఆదాయం లేక నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతూ వారి కొనుగోలు శక్తి క్షీణించిందని అన్నారు. ధరలు పెంచుకుంటూ పోతే పేదల జీవనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు . ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు చందు, నరేష్, నంద హరి, గోవింద్, పరుష రాముడు, టి నరేష్, ఆనంద్, వీరేశ్, తదితరులు పాల్గొన్నారు .