అయిజ రూరల్, జూలై 4 : నడిగడ్డలో సీడ్పత్తి సాగుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో రైతులు అధిక మొత్తంలో సీడ్పత్తిని సాగు చేశారు. గత ఏడాది మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులకు ఆశించిన స్థాయి లో దిగుబడి రాక, ధరలు లేక ఈ ఏడాది రైతులు సీడ్ పత్తి వైపు మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో సీడ్ పత్తి పంటను సాగు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో పొలాలు చదును చేసుకున్న రైతులు మే నెలలో విత్తనాలు నాటారు. నేటికీ సుమారు 40 రోజులు కావస్తుంది. ఇటీవల కొన్ని కంపెనీలు రైతులు సాగు చేసిన సీడ్ పత్తి పంటలను వారి రికార్డుల్లో నమోదు చేసుకోకుండా రైతులను ఇబ్బందికి గురిచేస్తూ నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రతి రైతు నుంచి ఎకరాకు కేవలం రెండు క్విం టాళ్ల విత్తనాలను మాత్రమే తీసుకుంటామని ఆర్గనైజర్ల ద్వారా రైతులకు తెలుపడంతో వారు ఆందోళనకు గురవుతున్నా రు. ఈ ఏడాది కురిసిన ముందస్తు వర్షాల కారణంగా కంపెనీలు ఆర్గనైజర్లకు విత్తనాలు ఇచ్చి రైతుల ద్వారా పొలాల్లో నాటించాలని వెంపర్లాడారు. దీంతో ఆర్గనైజర్లు కూడా కమీషన్లకు కక్కుర్తిపడి రైతులను మభ్యపెట్టి విత్తనాలను నాటించారు. ఫౌండేషన్ విత్తనాలు రైతులకు ఇచ్చేటప్పుడు కంపెనీలు, ఆర్గనైజర్లు ఎకరాకు ఎంత దిగుబడి వచ్చినా తీసుకుంటామని ప్రగల్భాలు పలికి రైతులను నమ్మించి విత్తనాలను వేయించారు.
విత్తనాలు నాటి సుమారు 40రోజులకు ఎకరాకు రెండు క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే తీసుకుంటామని కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా చెప్పించి మాటమారుస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన విత్తనాలను కంపెనీలు తీసుకోకపోతే భారీగా నష్టపోతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు లేక రైతులు అల్లాడుతుంటే మరో పక్క ఎకరాకు రెండు క్వింటాళ్ల సీడ్ విత్తనాలను తీసుకుంటామని చెబుతున్న మాట రైతుల పాలిట శాపంగా మారింది. కొంతమంది రైతులు తమ అవసరాల నిమిత్తం, కూలీల అడ్వాన్స్ కోసం ఆర్గనైజర్లను డబ్బు లు అడిగితే ఎకరాకు రూ.ఏడువేల నష్టపరిహారం ఇస్తాం మీ పంటను దున్నుకోండంటూ బాహటంగానే చెబుతున్నారు.
గతేడాది రైతులు సాగు చేసి పండించిన సీడ్ పత్తి విత్తనాలను ఆర్గనైజర్ల ద్వారా కంపెనీలకు ఇచ్చారు. అందుకు సంబంధించిన అమౌంట్ను కూడా ఇంత వరకు రైతులకు చెల్లించకుండా, పంట లు బాగా పండాయి, కంపెనీల దగ్గర విత్తనాలు అమ్ముడు కాలేదని మాయమాటలు చెబుతూ రైతులకు తక్కువ ధరను చెల్లించే ఆలోచనలో ఆర్గనైజర్లు ఉన్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నడిగడ్డలో ఇదే పద్ధతి కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించి ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.