నాగర్‌కర్నూల్, మే 25 (నమస్తే తెలంగాణ) : పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలు, మండలాలు ఆవిర్భవించాయి. ఇలా ఏర్పాటైన పలు కొత్త మండలాల్లో పోలీస్స్టేషన్లు, తాసీల్దార్, ఎంపీడీవో వంటి వివిధ మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు సైతం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఈ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రం ఏర్పాటు కాలేదు. దీంతో ఆయా మండల కేంద్రాల్లో సమీప సబ్‌సెంటర్ల ద్వారానే వైద్యం కొనసాగుతున్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి, కేటీదొడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, వనపర్తి జిల్లా చిన్నంబావి, అమరచింత, నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి, పదర వంటి నూతన మండలాల్లో అప్పటికే పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇలా మిగతా జిల్లాల్లోని మండలాల్లోనూ పీహెచ్‌సీలు ఉండగా.. ఇటీవల కొత్తగా మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల, నారాయణపేట జిల్లాలో కొత్తపల్లి, గుండుమాల్ మండల కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. ఇందులో కౌకుంట్ల, కొత్తపల్లి మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. ఇలా ఉమ్మడి పాలమూరులోని 8 మండలాల్లో కొత్తగా పీహెచ్‌సీలు ఏర్పాటయ్యే అవకాశమున్నది. ఇటీవలే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.
Mahabubnagar2
దీంతో త్వరలో ఆయా మండలాల్లో పీహెచ్‌సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నది. పీహెచ్‌సీల్లో 24 గంటలపాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అలాగే కాన్పులు, అన్ని రకాల వైద్య చికిత్సలు, మందులతోపాటు పాము, కుక్కకాట్లకు మందులు లభిస్తాయి. దీనివల్ల ఆయా మండలాల ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గరకు రానున్నాయి. ఇలా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా, నాణ్యంగా వైద్యం అందించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నది. కొత్త జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, జిల్లా దవాఖానలను జనరల్ ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేసింది. అలాగే డయాగ్నోస్టిక్ కేంద్రాలను నిర్మిస్తున్నది. ఇక పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. ఆయా దవాఖానల్లో ఎంబీబీఎస్ డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నది. ఖాళీగా ఉన్న చోట్ల డాక్టర్లు, నర్సింగ్, ఇతర సిబ్బందిని తరచూ నియమిస్తున్నది.
ఉచితంగా సాధారణ కాన్పులు చేపడుతున్నది. కరోనా సమయంలోనూ పీహెచ్‌సీల ద్వారా ప్రజలకు ఎంతో సేవలు అందాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పోతే సర్కార్ దవాఖానకే అన్న చందంగా మారాయి. ఉచితంగా, 24 గంటల వైద్యం అందుతుండడమే దీనికి కారణంగా పేర్కొనవచ్చు. ఈ క్రమంలో పేదలకు వైద్యం మరింత దగ్గరకు చేర్చేందుకు కొత్త మండలాల్లోనూ పీహెచ్‌సీలు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేదల వైద్యుడు సీఎం కేసీఆర్..
పేదలకు వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పీహెచ్‌సీల్లో కాన్పులు కూడా ఉచితంగానే జరుగుతున్నాయి. పేదలతోపాటు ధనవంతులూ ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. మా ఊర్కొండ వంటి కొత్త మండలాల్లో పీహెచ్సీ ఏర్పాటుకు కేబినెట్ తీర్మానించడం సంతోషకరం. వైద్య రంగంలో చేస్తున్న అభివృద్ధితో సీఎం కేసీఆర్ పేదల హృదయాల్లో దేవుడిగా మారుతున్నారు.
– శాంతకుమారి, జెడ్పీచైర్‌పర్సన్, నాగర్‌కర్నూల్