అయిజ, జూన్ 17 : గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు ఏ ర్పాటు చేయకుండా పచ్చని భూములు, నదులు, వాగులు కలుషితం చేసే పరిశ్రమలు స్థాపించి ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు సృష్టిస్తుందని అఖిలపక్ష కమిటీ జిల్లా అధ్యక్షుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలో అఖిపలక్ష కమిటీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్న 12 గ్రామాల రైతులు, ప్రజలపై కంపెనీ యాజమాన్యం ప్రైవేట్ సైన్యం, బౌన్సర్లతో దాడులు చేయించడంతోనే ప్రజలు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రజల తిరుగుబాటును గ్రహించిన యాజమాన్యం ప్రభుత్వంతో కుమ్మక్కై పోలీసులతో 40మందిపై అక్రమంగా కేసులు బనాయించడం, 12మందిని జైళ్లకు పంపిందని పేర్కొన్నారు.
పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని గత 10నెలలుగా ప్రజలు పోరాటం చేస్తున్న వేళ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మం త్రి శ్రీధర్‌బాబుతో సమావేశమై ఫ్యాక్టరీ రద్దు చేయాలని కోరగా, అందుకు స్పందించిన మంత్రి ఫ్యాక్టరీ రద్దు చేసేందుకు పరిశీలిస్తామని చెప్పిన మంత్రి నేడు పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసి తీరుతామని ప్రకటించడం చూస్తుంటే ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు.
మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే భూముల సమీపంలోనే చిన్న ధన్వాడ గ్రామస్తులకు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇచ్చిన స్థ లాలు ఉన్నాయని, గత కేసీఆర్ హయాంలో 50 మంది దళితులకు 150 ఎకరాలు పంపిణీ చేసిన ప్ర భుత్వ భూమి అక్కడే ఉందన్నారు. అక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రభుత్వ భూములతోపాటు రైతులు, ప్లాట్లు, తుంగభద్ర నది కలుషితం అవుతుందని అన్నారు.
ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుకాల ఉన్నట్లు తెలుస్తుందన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసి, అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అయిజ అఖిలపక్ష కమిటీ నాయకులు ఆంజనేయులు, స్వామిదాసు, శరణప్ప తదితరులు పాల్గొన్నారు.