హనుమకొండ (ఐనవోలు): రాజీ పడని చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలను ( Community Mediation Center ) సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కే పట్టాభిరామారావు (Judge Pattabhirama Rao ) అన్నారు. మండలంలోని కొండపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియేషన్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చిన్న చిన సమస్యలు సైతం అహం కారణంగా పోలీస్ స్టేషన్లకు వస్తాయని కుటుంబ తగాదాలు, భూతగదాలు, ఆస్తి పంపకాలు వంటి సమస్యలతో పలువురు పోలీస్స్టేషన్లు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తగాదాల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాసదన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
రాజీ పడదగిన, అనుకూలంగా ఉన్న సమస్యలను ఈ కేంద్రం ద్వారా అవసరమైతే ఒకటికి రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు పక్షాలను సామరస్యంగా పరిష్కారానికి ఒప్పించాలని నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్ పాండే, పంచాయతీ కార్యదర్శి కే లక్ష్మణ్, పోలీసులు, కమ్యూనిటీ మీడియేటర్ మదాసు దిలీప్, ఆశ వర్కర్స్, గ్రామస్థులు పాల్గొన్నారు.